Todd Lyons: ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో సవరణలకు డెమొక్రాట్స్ డిమాండ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలక వర్గం అనుసరిస్తున్న మాస్ డిపోర్టేషన్ విధానాలపై డెమొక్రాట్స్ భగ్గుమన్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) తాత్కాలిక చీఫ్ టాడ్ లయన్స్‌ను యూఎస్ చట్టసభ సభ్యులు తీవ్రంగా ప్రశ్నించారు. యూఎస్ హౌస్ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ ముందు జరిగిన ఈ విచారణలో వలస విధానాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంలో లయన్స్‌తో పాటు కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) కమిషనర్ రాడ్నీ స్కాట్, సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (సీఐఎస్) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో హాజరయ్యారు.
విచారణ సందర్భంగా, రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలను, అధికారుల పనితీరును ప్రశంసించగా, డెమోక్రాటిక్ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. విచారణ ప్రక్రియ సరిగా లేకపోవడం, ఇద్దరు అమెరికన్ పౌరులను ఫెడరల్ ఏజెంట్లు కాల్చి చంపడం, బాధితులను ‘దేశీయ ఉగ్రవాదులు’ అని అభివర్ణించిన హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ రాజీనామా చేయాలనే డిమాండ్లపై డెమోక్రాట్లు అధికారులను నిలదీశారు. “అమెరికాలో రహస్య పోలీసులు ఉండకూడదు. ముసుగులు ధరించిన ప్రభుత్వ ఏజెంట్లు వీధుల్లో పౌరులను కాల్చి చంపకూడదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
సెక్రటరీ రాజీనామాపై ప్రశ్నించగా, లయన్స్ సమాధానం దాటవేశారు. దర్యాప్తు జరుగుతున్నందున దానిపై వ్యాఖ్యానించలేనని చెప్పారు. ఏజెంట్లకు బాడీ కెమెరాల వాడకాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న 13,000 మంది ఐస్ అధికారుల్లో 3,000 మందికి పైగా, 20,000 మంది బార్డర్ పెట్రోల్ ఏజెంట్లలో సుమారు 10,000 మందికి బాడీ కెమెరాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. న్యూజెర్సీకి చెందిన మరో డెమోక్రాటిక్ ప్రతినిధి లామోనికా మెక్ఐవర్ “పౌరులను చంపుతూ కూడా నిధులు పొందుతున్న ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయి?” అని ప్రశ్నిస్తూ, ఐస్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల మిన్నియాపాలిస్లో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించిన నేపథ్యంలో ఇమిగ్రేషన్ ఏజెన్సీల పనితీరులో మార్పులు తీసుకురావాలని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. ఈ వివాదం కారణంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (డీహెచ్ఎస్) కేవలం రెండు వారాల తాత్కాలిక నిధులు మాత్రమే అందాయి. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. రోవింగ్ పెట్రోల్స్ నిలిపివేయడం, వారెంట్ నిబంధనలను కఠినతరం చేయడం, ఏజెంట్లు ముసుగులు తీసివేసి బాడీ కెమెరాలు ఆన్ చేసేలా ‘మాస్క్స్ ఆఫ్, బాడీ కెమెరాస్ ఆన్’ విధానాన్ని అమలు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.













