White House: ఒబామా దంపతులపై జాతి వివక్ష వీడియో ప్రకంపనలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో తీవ్ర వివాదంలో ఇరుక్కున్నారు. ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు అయిన ఓవీడియోలో ఒబామా దంపతుకు.. ఏఐ సాంకేతికత జోడించి కోతుల శరీరాలను తగిలించి, అత్యంత దారుణంగా చిత్రీకరించారు. దాదాపు 12 గంటల పాటు ఈ వీడియో .. ఆన్ లైన్ ఖాతాల్లో తిరిగింది. తర్వాత వెల్లువెత్తిన నిరసనలతో ఆ వీడియోను తొలగించారు. అయితే.. ఈ వీడియోను తాను అభ్యంతరకరంగా ఉన్న భాగాన్ని చూడలేదని.. కేవలం ఓటింగ్ యంత్రాల అక్రమాలకు సంబంధించిన భాగం చూసి, సిబ్బందికి ఇచ్చానని ట్రంప్ సమర్థించుకున్నారు. తాను క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదన్నారు ట్రంప్.
ఈ ఘటనపై డెమొక్రాట్లే కాకుండా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా భగ్గుమంటున్నారు. సెనేట్‌లోని ఏకైక నల్లజాతి రిపబ్లికన్ నేత టిమ్ స్కాట్ ఈ వీడియోను “అత్యంత జుగుప్సాకరమైనది”గా అభివర్ణించారు. సొంత పార్టీ ఎంపీలు మైక్ లాలర్, సుసాన్ కాలిన్స్ వంటి వారు కూడా ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, రోజుకు వేల సంఖ్యలో విషయాలను చూస్తుంటానని, ఇందులో తన తప్పేమీ లేదని ట్రంప్ తేల్చేశారు.
ట్రంప్ అధికారిక ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో గురువారం రాత్రి పోస్ట్ అయిన ఈ నిమిషం నిడివి గల వీడియోలో.. ఒబామా దంపతుల ముఖాలను ఏఐ సాంకేతికతతో కోతుల శరీరాలకు తగిలించి అత్యంత దారుణంగా చిత్రీకరించారు. సుమారు 12 గంటల పాటు ఆన్లైన్లో ఉన్న ఈ వీడియోపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో చివరికి తొలగించారు. మొదట దీనిని కేవలం ఒక ‘మీమ్’ అని కొట్టిపారేసిన వైట్ హౌస్ వర్గాలు, ఆ తర్వాత సిబ్బంది చేసిన పొరపాటుగా అభివర్ణించాయి.
అయితే ట్రంప్ వ్యవహారశైలి తెలిసిన వారు.. ఇది అధ్యక్షుడికి తెలియకుండా జరిగిందంటే నమ్మేలా లేదంటున్నారు. గతంలో కూడా ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ రావడంపైనా ట్రంప్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఓటింగ్ యంత్రాల అక్రమాలకు పాల్పడి.. గతంలో రెండోసారి తాను అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారన్నట్లుగా ఆరోపించారు కూడా.













