హెచ్ 1బీ వీసాల విషయంలో ..బైడెన్ సర్కారు మరో కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్-1బీ వీసాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు తెచ్చిన నిబంధన అమలును మరింత జాప్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మే 14 వరకు దాని అమలును నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించే ప్రవాసీయులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. స్వదేశీయులను మెప్పించడానికి ట్రంప్ విదేశీ నిపుణులకు కనీస వేతన నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలు వేతనాల భారం తగ్గించుకోవడానికి విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయన్నది ఆయన వాదన.
అయితే విదేశీ నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకొనే సంస్థల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరోవైపు ప్రవాసీయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు వారికి ఊరటనిచ్చాయి. అయితే బైడెన్ సర్కారు నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ (ఫెయిర్) సంస్థ వ్యతిరేకించింది. ట్రంప్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిబంధన అమెరికా ఉద్యోగులకు భద్రతనిస్తుందని, దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన వారి కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాటు హెచ్-1బీ వీసాల జారీకి మళ్లీ లాటరీ పద్ధతిని అనుసరిచండం కూడా సరికాదని అంతర్గత భద్రత శాఖకు తెలిపింది.






