జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడు విధానపరమైన నిర్ణయాల వల్ల హెచ్1బీ వంటి వీసాలు తిరస్కరణకు గురైన విదేశీ ఉద్యోగుల అభ్యర్థనలను, అభ్యంతరాలను తిరిగి పరిశీలిస్తామని అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది. స్థానిక అమెరికన్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు కఠినమైన వలస విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కఠిన, వివక్షాపూరిత నిభంధనల కారణంగా అనేకమంది వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు వీరి అభ్యర్థనలను తిరిగి సమీక్షించాలని తాజాగా బైడెన్ సర్కారు నిర్ణయించింది. హెచ్1బీ అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీని కోసం భారతీయులే ఎక్కువగా పోటీపడుతుంటారు.






