అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోం : జిన్‌పింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ దేశం జోక్యం చేసుకోబోదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నుంచి జో బైడెన్‌కు హామీ లభించింది. వీరిద్దరూ నవంబర్‌లో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకొంది. గత వారం బ్యాంకాక్‌లో 12 గంటల పాటు జరిగిన ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలోనూ మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. నాడు చైనా మంత్రి వాంగ్‌యీ మాట్లాడుతూ తాము అమెరికా ఎన్నికల్లో జోక్యానికి దూరంగా ఉంటామని పునరుద్ఘాటించారు. 2016 అమెరికా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకొన్నట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన కీలక సమాచారాన్ని లీక్ చేశాయి. అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ ఆ దెబ్బతో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఇరాన్, క్యూబా, చైనా ఏజెంట్లు తరచూ ఎన్నికల్లో జోక్యం చేసుకొంటున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.






