SA vs ZIM: జింబాబ్వేపై సఫారీల విజయం.. అజేయంగా సెమీస్లోకి సౌతాఫ్రికా!
టీ20 వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా (SAvsZIM) జట్టుకు తిరుగులేకుండా పోయింది. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తుచేస్తూ అప్రతిహతంగా ముందుకెళ్తున్న సఫారీ సేన.. సూపర్-8 దశలోనూ అదే జోరును కొనసాగించింది. ఆదివారం జరిగిన తమ చివరి మ్యాచ్లో జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసి, పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు ఈ మెగా టోర్నీలో అంచనాలకు మించి సంచలన ప్రదర్శన చేసిన జింబాబ్వే.. ఈ ఓటమితో నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సికందర్ రజా ‘వన్ మ్యాన్ షో’..
ఈ మ్యాచ్లో (SAvsZIM) టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (43 బంతుల్లో 73) మినహా ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటరూ రాణించలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే జింబాబ్వే తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు మారుమని (7), బెన్నెట్ (15), డియోన్ మైయర్స్ (11) ఘోరంగా విఫలమవడంతో ఆ జట్టు 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ బుర్ల్ (5), టోనీ మున్యోంగా (2) సైతం సఫారీ బౌలర్ల ధాటికి పెవిలియన్కు క్యూ కట్టారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ రజా మాత్రం బాధ్యతాయుతంగా ఆడుతూ, ఎదురుదాడికి దిగి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.

ఆరంభంలో తడబడినా..
అనంతరం 154 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో (SAvsZIM) సౌతాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (4) తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కేవలం 14 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఈ క్లిష్ట దశలో క్రీజులోకి వచ్చిన యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గాడినపెట్టాడు. కేవలం 18 బంతుల్లోనే 42 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి (SAvsZIM) తోడుగా రికెల్టన్ (31), డేవిడ్ మిల్లర్ (22) విలువైన పరుగులు జోడించారు. చివర్లో జార్జ్ లిండే (30 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేయడంతో.. సౌతాఫ్రికా కేవలం 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలను చేరుకుంది.
ఇవి కూడా చదవండి

















