చిన్నస్వామిలో పెద్ద పోరు..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇది 34వ మ్యాచ్ కాగా.. సొంత గడ్డపై ఆర్సీబీ ఆడుతున్న చివరి లీగ్ మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సీజన్ లో ఇరు జట్ల ప్రదర్శనను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7వ స్థానంలో ఉంది. ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే గుజరాత్ జట్టుకు ఈ విజయం చాలా అవసరం. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ(Virat Kohli) (247 పరుగులు), గుజరాత్ తరపున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (265 పరుగులు)(Shubhman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ముఖాముఖి రికార్డుల విషయానికి వస్తే, ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ హోరాహోరీగానే సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో 3 సార్లు విజయం సాధించి సమంగా ఉన్నాయి. అయితే, ఒక విచిత్రమైన గణాంకం ఏమిటంటే, వీరిద్దరి మధ్య జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఛేజింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో, టాస్ గెలిచిన జట్టు మరోసారి బౌలింగ్ ఎంచుకుని ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ 10 వికెట్లతో రాణిస్తుండగా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 12 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నారు. బ్యాటర్ల స్వర్గధామంగా పేరొందిన చిన్నస్వామి మైదానంలో బౌలర్లు ఎంతవరకు కట్టడి చేస్తారనేది కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి








