RCB vs DC: రాహుల్ వర్సెస్ ఆర్సీబీ, మినీ యుద్దమే..!
ఐపీఎల్ 2026(IPL) సీజన్లో భాగంగా నేడు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికరమైన పోరు జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ 26వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలిచిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరువలో ఉంది. మరోవైపు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది.
ఈ రెండు జట్ల ముఖాముఖి రికార్డులను పరిశీలిస్తే ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 33 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 20 సార్లు విజయం సాధించగా, ఢిల్లీ కేవలం 12 సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తన గత మూడు హోమ్ మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలను సాధించి హ్యాట్రిక్ ఊపుమీదుంది. సొంత గడ్డపై తమ పాత రికార్డును కొనసాగిస్తూ ఐదో విజయాన్ని నమోదు చేయాలని రజత్ పటీదార్ సేన భావిస్తోంది.
అయితే ఇక్కడ ఢిల్లీ స్టార్ ఆటగాడు.. కెఎల్ రాహుల్(KL Rahul) సొంత మైదానం చిన్నస్వామి కావడంతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. గత ఏడాది రాహుల్ ఇక్కడే ఆర్సీబీపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి.. కాంతారా సినిమాలో ఓ సన్నివేశాన్ని రిపీట్ చేసాడు. దీనితో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఇక పిచ్ పరిస్థితుల విషయానికి వస్తే, చిన్నస్వామి స్టేడియం సాధారణంగా భారీ స్కోర్లకు నిలయం. అయితే ఇది మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఎండ ప్రభావం వల్ల పిచ్ క్రమంగా నెమ్మదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంతి గ్రిప్ అయ్యే అవకాశం ఉండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించవచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే, రెండో ఇన్నింగ్స్‌లో స్లో పిచ్‌పై ప్రత్యర్థిని అడ్డుకోవడం సులభం కావచ్చు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే(Virat Kohli) ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరో భారీ ఇన్నింగ్స్‌తో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్ రజత్ పటీదార్(Rajat Patidar), ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ వెన్నెముకగా ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ ఫామ్ ఆ టీమ్‌కు చాలా ముఖ్యం. ఆర్సీబీపై రాహుల్‌కు 71.1 సగటుతో మెరుగైన రికార్డు ఉంది. అలాగే అక్షర్ పటేల్ కెప్టెన్సీలో కులదీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్‌తో కోహ్లీ సేనను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.








