వాంఖడేలో ముంబై జీవన్మరణ పోరాటం..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్లో నేడు ఒక ఆసక్తికరమైన పోరుకు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్, టాప్ 3లో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని ఓడిపోయిన ముంబై(Mumbai Indians)కి, ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ముంబై జట్టును ప్రస్తుతం గాయాల సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohith Sharma) హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది.
అతను అందుబాటులో లేకపోతే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ తలకిందులయ్యే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కాస్త ఫాంలోకి రావడం, సొంత గడ్డపై ఆడుతుండటం ముంబైకి కలిసొచ్చే అంశం. జస్ప్రీత్ బుమ్రా(Bumrah) తన పదునైన యార్కర్లతో పంజాబ్(Punjab) బ్యాటర్లను కట్టడి చేయాల్సి ఉంది. డెత్ ఓవర్లలో బౌలర్లు పరుగులు ధారాళంగా ఇవ్వడం, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఉన్న స్లో ఓవర్ రేట్ పెనాల్టీ ఒత్తిడి జట్టుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఛేజింగ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నారు. ముంబైతో తలపడిన గత 34 మ్యాచ్‌ల్లో పంజాబ్ 17 సార్లు విజయం సాధించింది. వాంఖడేలో కూడా ముంబైకి ధీటుగా పంజాబ్ కు అడ్వాంటేజ్ ఉంది. వాంఖడే పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ నేడు పంజాబ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రికెల్టన్ స్ట్రైక్ రేట్ కేవలం 139 మాత్రమే ఉండటమే కాకుండా, రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో 152 స్ట్రైక్ రేట్‌తో 70 పరుగులు చేసినప్పటికీ, మూడుసార్లు ఔట్ అవ్వడం రికెల్టన్ కు మైనస్ గా మారింది. పంజాబ్ ఈ లెఫ్ట్ ఆర్మ్ అటాక్‌తో ముంబై ఓపెనింగ్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. రాత్రి మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని, తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ సీజన్లో వాంఖడే స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. ఇక్కడ జరిగిన గత నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ 220 కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి అంటేనే పిచ్ ఎంత ఫ్లాట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి








