వరుస విజయాల జోరులో గుజరాత్, బోణీ కోసం కోల్‌కతా పోరాటం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఒక ఆసక్తికర పోరు జరగనుంది. హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT) తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుంటే, ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా లేని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఎలాగైనా ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడిపోయిన కేకేఆర్ జట్టుకు, నేటి మ్యాచ్ మనుగడ ప్రశ్నగా మారింది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన బలం వారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్. ఈ సీజన్లో అతను భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్‌పై గిల్‌కు అద్భుతమైన రికార్డు ఉండటం ఆ జట్టుకు కొండంత బలం. అతనికి తోడుగా సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తుండటంతో బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ వంటి బౌలింగ్ యూనిట్ తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. డెత్ ఓవర్లలోరబాడా, సిరాజ్, ప్రసిద్ తమ పదునైన పేస్‌తో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. అజింక్య రహానే సారథ్యంలోని ఈ జట్టులో సమన్వయం లోపించింది. భారీ ఆశలు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్ నుంచి ఇప్పటివరకు ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా రాలేదు. ఫినిషర్ రింకూ సింగ్ కూడా గత సీజన్ల తరహాలో ప్రభావం చూపలేకపోతున్నాడు. బౌలింగ్‌లో భారీ ఆశలుపెట్టుకున్న వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏ బౌలర్ కూడా గుజరాత్ బ్యాటర్లను భయపెట్టేలా కనిపించడం లేదు. వరుసగా ఓటములు చవిచూడటంతో ఆ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది.
ఇక పిచ్ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. బంతి బ్యాట్‌కు చక్కగా వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపుతుంది. గత మ్యాచ్‌ల్లో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు అందుకున్నాయి. బలాబలాల పరంగా చూస్తే గుజరాత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, డూ-ఆర్-డై స్థితిలో ఉన్న కేకేఆర్ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








