కేకేఆర్ బ్యాటింగ్ అట్టర్ ఫ్లాప్.. ఆ ఇద్దరూ శుద్ధ దండుగ..!
ఐపీఎల్ 2026లో(IPL 2026) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోలేకపోయిన’ చందంగా తయారైంది. భారీ ఆశలతో, కోట్లాది రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసిన స్టార్ ఆటగాళ్లు కనీస పోరాట పటిమను కూడా చూపలేకపోతున్నారు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ వెన్నెముకగా భావించిన రింకూ సింగ్(Rinku Singh), కామెరూన్ గ్రీన్(Cameron Green) ల వరుస వైఫల్యాలు కేకేఆర్‌ను పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడేశాయి. నిన్న చెన్నైతో(CSK) జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన జట్టు ఓటమిని శాసించింది.
రింకూ సింగ్ గురించి మాట్లాడుకుంటే.. గత సీజన్లలో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది అద్భుతాలు చేసిన ఈ ‘ఫినిషర్’, ఈ ఏడాది క్రీజులోకి వచ్చి బంతులను వృథా చేయడమే పనిగా పెట్టుకున్నాడు. నిన్న 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో రింకూ సింగ్ కేవలం 12 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ కేవలం 50 మాత్రమే. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 78 మాత్రమే కావడం. అందులో ఒక్క పవర్ఫుల్ ఇన్నింగ్స్ కూడా లేకపోవడం రింకూ ఫామ్‌పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
మరోవైపు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన కామెరూన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు) ప్రదర్శన మరీ ఘోరంగా ఉంది. అటు బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇస్తూ, ఇటు బ్యాటింగ్‌లో కనీసం ఖాతా తెరవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయి ‘గోల్డెన్ డక్’గా వెనుదిరగడమే కాకుండా, బౌలింగ్‌లో కేవలం 2 ఓవర్లలోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు. రూ. 25 కోట్లు పోసి కొన్న ప్లేయర్ ఒక్క ఇంపాక్ట్ ఫుల్ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడం కేకేఆర్ మేనేజ్మెంట్ నిర్ణయాలను ప్రశ్నిస్తోంది.
ఇద్దరు కీలక ఆటగాళ్ల వైఫల్యం వల్ల కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. మిడిలార్డర్లో నిలకడ లేకపోవడం, ఫినిషింగ్‌లో వేగం తగ్గడం వల్ల వరుసగా పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఈ స్టార్ ఆటగాళ్లు ఇప్పటికైనా మేల్కొని తమ ఫామ్‌ను నిరూపించుకోకపోతే, ప్లే-ఆఫ్స్ ఆశలు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. కేకేఆర్ బౌలింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








