BCCI Awards: ద్రవిడ్, బిన్నీ, మిథాలీకి బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతిష్టాత్మక ‘నమన్’ అవార్డులను (BCCI Awards) శనివారం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరగనున్న అంగరంగ వైభవ ప్రదానోత్సవంలో విజేతలకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. భారత క్రికెట్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీలతో పాటు మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్‌లను అత్యున్నత లైఫ్‌టైం అచీవ్మెంట్ (జీవిత సాఫల్య) పురస్కారాలతో బీసీసీఐ సత్కరించనుంది.
దిగ్గజాలకు ‘కల్నల్ సీ.కే నాయుడు’ గౌరవం
రాహుల్ ద్రవిడ్ & రోజర్ బిన్నీ.. ఈ ఇద్దరు దిగ్గజాలకు బీసీసీఐ అత్యున్నత పురస్కారమైన ‘కల్నల్ సీ.కే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం’ (BCCI Awards) వరించింది. 1983 వన్డే వరల్డ్ కప్ విజయంలో అత్యధిక వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన బిన్నీ, అండర్-19 జట్టుకు కోచ్‌గా, జాతీయ సెలెక్టర్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా (2022-23) విశేష సేవలందించారు. ఇక ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆటగాడిగా 24,000 అంతర్జాతీయ పరుగులు సాధించడమే కాకుండా.. ఎన్సీఏ (NCA) అధిపతిగా యువ రక్తాన్ని జట్టులోకి తెచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.
భారత మహిళా క్రికెట్‌కు ఆద్యురాలిగా, మార్గదర్శిగా నిలిచిన హైదరాబాద్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కు బీసీసీఐ ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డును ప్రకటించింది. 18 ఏళ్ల పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) సాధించిన ప్రపంచ రికార్డును నెలకొల్పిన మిథాలీ.. తన సారథ్యంలో భారత్‌ను రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేర్చింది.
గిల్, స్మృతి మంధానల ఆధిపత్యం
శుభ్‌మన్ గిల్: 2024-25 సీజన్‌కు గాను ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్టాత్మక ‘పాలీ ఉమ్రిగర్ అవార్డు’ను (BCCI Awards) గిల్ కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డును అతను ముద్దాడటం ఇది రెండోసారి. గతేడాది 9 టెస్టుల్లో 983 పరుగులు, 11 వన్డేల్లో 490 పరుగులతో అతను చెలరేగాడు.
స్మృతి మంధాన: మహిళల విభాగంలో స్మృతి మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును (BCCI Awards) వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా ఐదోసారి సొంతం చేసుకుంది. భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ గెలవడంలో (434 రన్స్) ఆమెది కీలక పాత్ర. ఓ ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు (5) చేసిన క్రీడాకారిణిగా, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. బెస్ట్ బౌలర్ అవార్డును దీప్తి శర్మ దక్కించుకుంది.
తెలుగమ్మాయి శ్రీచరణికి ‘బెస్ట్ డెబ్యూ’
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొలి ఏడాదే అద్భుత ప్రదర్శనతో ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డును (BCCI Awards) ఎగురేసుకుపోయింది. వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి భారత జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. పురుషుల విభాగంలో పేసర్ హర్షిత్ రాణా ఈ బెస్ట్ డెబ్యూ అవార్డును గెలుచుకున్నాడు.
దేశవాళీ ఆల్రౌండర్లకు ఇచ్చే ‘లాలా అమర్నాథ్ అవార్డు’లను (BCCI Awards) ఆయుశ్ మాత్రే (పరిమిత ఓవర్లు), హర్ష్ దూబె (రంజీ ట్రోఫీ) సొంతం చేసుకున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఏకంగా నాలుగు టైటిల్స్ గెలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (MCA) అత్యుత్తమ బీసీసీఐ అవార్డు దక్కింది.








