ఎన్ఐఏ చీఫ్‌గా వైసి మోదీ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసి మోదీ నియమితులయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్‌గా ఇటీవలే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎన్ఐఏ చీఫ్‌గా మోదీ పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేయటంతో, సోమవారం ఆయన పేరును డివోటి ప్రకటించింది. 2021 మే 31 వరకూ ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు. ఎన్ఐఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి వీలుగా తక్షణం ఆయన ఓఎస్డి బాధ్యతలు స్వీకరించవచ్చని కేబినెట్ నియామకాల కమిటీ స్పష్టం చేసింది. అసోం- మేఘాలయ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వైసి మోదీ. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)లో ప్రత్యేక డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ప్రస్తుత ఎన్ఐఏ చీఫ్ శరద్‌కుమార్ పదవీకాలం అక్టోబర్ 30తో ముగుస్తుండటంతో, తదుపరి వైసీ మోదీ బాధ్యతలు స్వీకరించాలని కేబినెట్ నియామకాల కమిటీ పేర్కొంది.








