ఎన్నారై శాస్త్రవేత్తల కోసం వజ్ర ఫ్యాకల్టీ
మేధోవలసను తిరుగుముఖం పట్టించే కృషిలో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రవాస భారతీయ(ఎన్నారై) శాస్త్రవేత్తలను రప్పించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద ఎన్నారై శాస్త్రవేత్తలు ఒకటి నుంచి మూడు నెలల వరకు దేశంలోని పరిశోధనా సంస్థల్లో పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వ నిధులతో పనిచేసే అకడమిక్, పరిశోధనా సంస్థలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రిసెర్చ్ (వజ్ర) ఫ్యాకల్టీ అని పిలిచే ఈ పథకం కింద విదేశీ శాస్త్రవేత్తలకు భారత్తో పనిచేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఎన్నారైలు, భారత సంతతి ప్రజలు, విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయుల కొరకు ఈ పథకాన్ని ప్రారంభించారు. వజ్ర ఫ్యాకల్టీ కింద పని చేసే ఈ శాస్త్రవేత్తలకు మొదటి నెల 15వేల డాలర్లు, తదుపురి రెండు నెలలకు 10వేల డాలర్ల చొప్పున జీతం ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్ష్వర్ధన్ తెలిపారు. ఈ పథకం కింద ఆహ్వానించే శాస్త్రవేత్తల సంఖ్యను వెయ్యికి పరిమితం చేశారు.








