సైయెంట్ డైరెక్టర్‌గా అమెరికా మాజీ రాయబారి
ఐటి ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైయెంట్ అమెరికా మాజీ రాయబారి వియన్ తుమ్మలపల్లిని డైరెక్టర్‌గా నియమించుకుంది. ఏప్రిల్ 20 నుంచి ఈయన నియామకం అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. కార్పొరేట్ రంగంతో పాటు అమెరికా ప్రభుత్వంలో కీలకమైన విభాగంలో విశిష్ట సేవలను ఈయన అందించారని కంపెనీ పేర్కొంది. బోర్డుకు నేతృత్వం వహించనున్న వియన్ సారథ్యంలో కంపెనీ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని సైయెంట్ ఫౌండర్, చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ సర్వీసుల విభాగంలో విశేషమైన అనుభవం ఉన్న వినయ్ 2009 నుంచి 2013 వరకు బెలిజ్‌లో అమెరికా రాయబారిగా పనిచేశారు. అనంతరం అమెరికా వాణిజ్య శాఖ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా ఉన్న సెలక్ట్యుఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కాగా అమెరికా ప్రభుత్వం హెచ్1బి వీసా లపై కఠిన నిర్ణయం తీసుకున్న తరుణంలో అమెరికా పౌరుడైన వినయ్‌ను సైయెంట్ బోర్డులోకి తీసుకోవటం విశేషం.








