పండంటి పాపకు జన్మనిచ్చిన యువకుడు
బ్రిటన్లో గర్భందాల్చిన తొలి పురుషుడు 21ఏళ్ల హేడెన్ క్రాస్ గుర్తున్నారుగా? ఆయన పండంటి పాపకు జన్మనిచ్చారు. అన్ని విధాల పాప ఆరోగ్యంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ని అంటూ ఆయన మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. పైజీ అనే అమ్మాయిగా జన్మించిన ఆయన పురుషుడిగా మారేందుకు హోర్మోన్ చిక్సితను ఆశ్రయించారు. భవిష్యత్తులో పిల్లల కోసం తన అండాలను శీతలీకరించి భద్రపరుచుకోవాలని భావించారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సేవల సంస్థ దీనికి ససేమిరా అంది. దీంతో ఆయన లింగ మార్పిడి ప్రక్రియ కొంత కాలం వాయిదా పడింది. అయితే చికిత్స ప్రారంభం కావడంతో చట్టప్రకారం పురుషుడిగానే జీవిస్తున్నారు. గత సెప్టెంబరులో ఓ వ్యక్తి వీర్యదానానికి ముందుకువచ్చారు. దీంతో గర్భందాల్చిన క్రాస్, బ్రిటన్లోని గ్లౌసెస్టెర్షైర్ రాయల్ ఆసుపత్రిలో జూన్ 16న పాపకు జన్మనిచ్చారు. త్వరగా చికిత్సను పూర్తిచేసుకుని సంపూర్ణంగా పురుషుడయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు క్రాస్ తెలిపారు.








