కాల్ డ్రాప్స్ కు రూ.10 లక్షల జరిమానా
ఫోన్ మాట్లాడుతుండగా మధ్యలో కాల్ కట్ అయితే కస్టమర్లు ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై అలా మధ్యలో నే సిగ్నల్ నిలిచిపోయి కాల్ డ్రాప్ అయ్యి కస్టమర్లను ఇబ్బందులు పెట్టే… ఆయా టెలికాం సంస్థలకు భారీ జరిమానా విధించేందుకు రెడీ అవుతోంది టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్.
కాల్ డ్రాప్స్ నివారణ కోసం టెలికాం నెట్వర్క్ సంస్థలకు మార్గదర్శకాలను… ట్రాయ్ విడుదల చేసింది. వరుసగా 9నెలల పాటు ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు ఎక్కువగా రూ.10 లక్షల వరకు ఫైన్ విధించనున్నారు. ఇది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించాలనుకున్నట్లు తెలిపారు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ. అది దశలవారీగా పెరుగుతూ పోతుందని… నెట్వర్క్ తీరుకు అనుగుణంగానే ఫైన్ విధిస్తారని తెలిపారు. కాల్ డ్రాప్స్ కు సంబంధించి, ట్రాయ్ ప్రమాణాలను అందుకోలేకపోతే, మొదటి మూడు నెలల్లో రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాలి. వరుసగా రెండో సారి మూడు నెలల్లోనూ నెట్వర్క్ మెరుగుపడకపోతే.. అప్పుడు జరిమానా 7 లక్షల 50వేల వరకు అవుతుంది. మూడో సారి మూడు నెలల్లో సంస్థల తీరు మారకుంటే అలానే ఉంటే.. రెట్టింపు జరిమానా రూ.10 లక్షల వరకు వసూలు చేస్తారని ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తా స్పష్టం చేశారు. ఎక్కువలో ఎక్కువగా నెట్వర్క్కు విధించే జరిమానా రూ.10 లక్షలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు సేవల్లో నాణ్యతా లోపం కారణంగా కాల్ డ్రాప్స్ ఏర్పడితే, జరిమానా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఉండేది.
ఇప్పటివరకు టెలికాం సర్కిల్ పరిధిలో కాల్ డ్రాప్స్ ను లెక్కిస్తూ వచ్చారు. ఇకపై సర్కిల్ పరిధిలోని టవర్ల వారీగా లెక్కించే సామర్థ్యాన్ని ట్రాయ్ సంపాధించింది. కాల్ డ్రాప్స్ లెక్కింపులో కొన్ని సమస్యలు వస్తుంటాయి. సగటును పరిగణనలోకి తీసుకుంటే, అనేక అంశాలు మరుగున పడుతున్నాయి. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ టవర్లు పనిచేయకపోవడం, అరకొరగా సేవల నాణ్యత వంటివి లెక్కలోకి వచ్చేవి కాదు. కొత్త మార్గదర్శకాల్లో, నెట్వర్క్ పరిధిలో ఇలాంటి తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందులనూ గుర్తిస్తాం. అదీ ప్రాంతాల వారీగా గుర్తించగలమని తెలిపారు.
కాల్ డ్రాప్స్ లో నిబంధనలు…
ఒక టెలికాం సర్కిల్లో 90 శాతం మొబైల్ టవర్లు, 98 శాతం కాల్స్ అందుకోవడంలో 90 శాతం సమయం పాటు విఫలం కాకూడదు. అంటే 2 శాతం కాల్స్లో మాత్రమే డ్రాప్స్ ఏర్పడవచ్చు.
ఒకవేళ కష్టతర పరిస్థితులు ఏర్పడినా, కాల్స్ రద్దీ విపరీతంగా ఉన్నా, 90 శాతం టవర్ల పరిధిలో 3 శాతానికి మించి కాల్స్ డ్రాప్స్ ఏర్పడకూడదు.
కాల్ కట్ అయినా, అది నమోదు కాకుండా చూసుకునేందుకు టెలికాం ఆపరేటర్లు వినియోగిస్తున్నారని ఆరోపణలున్న రేడియో లింక్అవుట్ టెక్నాలజీ (ఆర్ఎల్టీ)కి ప్రమాణాలు నిర్దేశించారు. వాస్తవానికి వినియోగదారుడు ప్రయాణిస్తూ, కాల్ మాట్లాడుతున్నపుడు, ఒక టవర్ నుంచి మరో టవర్కు అతని మొబైల్ సిగ్నల్ జత చేయడానికి ఈ సాంకేతికత వాడాలి. ఇది 4-64 ప్రమాణాల్లో ఉండాలి. 48కి మించి వాడితే, అందుకు కారణాలను ఆపరేటర్ తెలపాల్సి ఉంటుంది.








