నెలకు లక్ష వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ ను మానేసి…వ్యవసాయం చేస్తున్న విశాలాక్షి
16 కుటుంబాలను లక్షాధికారులను చేసింది.
వ్యవసాయం అంటే నిజంగా నేటి తరుణంలో చాలా మందికి చిన్న చూపు అయింది. అందులో సాధించేది ఏముంది, ఏం చేసినా నష్టమే వస్తుంది తప్ప లాభం రాదు, అది చేయడం శుద్ధ దండగ అన్న భావనలో చాలా మంది ఉన్నారు. అయితే ఆమె మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. నిజానికి చేసి చూపాలే కానీ వ్యవసాయాన్ని మించిన లాభసాటి వృత్తి ఇంకొకటి ఉండదని చాటి చెప్పింది ఆమె. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ వ్యవసాయం గురించి తెలియకున్నా దానిపై అవగాహన పెంచుకుని మరీ గత కొన్నేళ్లుగా ఆమె విజయవంతంగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. అంతేకాదు, తన విజయంలో రైతులను కూడా భాగస్వాములను చేస్తూ ఎంతో మందికి ఆర్గానిక్ వ్యవసాయంలో మెళకువలను చెబుతోంది. రైతులు కూడా లాభాలు పొందేలా చేస్తోంది.
ఆమె పేరు విశాలక్షి పద్మనాభన్. చదివింది సీఏ. పనిచేస్తున్నది బెంగుళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీలో. లక్షల్లో జీతం. విలాసవంతమైన జీవితం. అయినా ఆమె తన జీవితంలో ఏదో సాధించాలనుకుంది. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బన్నెర్ఘట్ట అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ కొంత భూమిని కొనుగోలు చేసింది. అందులోనే వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే సాధారణంగా రైతులు పండించినట్టుగా కాకుండా పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో ఎరువులను తయారు చేసి వాటితో పంటలను పండించడం మొదలు పెట్టింది. అయితే ఇలా ఆర్గానిక్ ఫామింగ్ చేసేందుకు విశాలాక్షి ముందుగా ఆ అంశంపై ఎంతగానో వివరాలను సేకరించి వాటిని ఆకళింపు చేసుకుంది. ఎన్నో పుస్తకాలు చదివింది. నిపుణులను కలిసింది. ఆ తరువాతే ఆర్గానిక్ ఫామింగ్ చేయడం మొదలు పెట్టింది.
నెమ్మదిగా ఆమె అందులో విజయాలు సాధించడం మొదలు పెట్టింది. దీంతో స్థానికంగా ఉన్న రైతులకు కూడా లాభం కలిగేలా ఆమె Buffalo Back అనే వినూత్న వెంచర్‌ను స్టార్ట్ చేసింది. అందులో స్థానికంగా ఉన్న 16 కుటుంబాలకు చెందిన రైతులను కలుపుకుంది. వారికి ఆర్గానిక్ ఫామింగ్ ఎలా చేయాలో చెప్పడంతోపాటు ఆ వెంచర్లో పార్ట్నర్షిప్ ఇచ్చింది. దీంతో అందరూ కలసి సమిష్టిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారిని విజయం వరించింది. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలను అమ్ముతూ లాభాలను గడించసాగారు. అలా విశాలాక్షి గత 9 సంవత్సరాలుగా అదే గ్రామంలో ఉంటూ రైతులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది. సరైన పద్ధతిలో చేయాలే గానీ వ్యవసాయం అంత లాభసాటి వ్యాపకం, వృత్తి మరొకటి ఉండదని ఆమె చాటి చెబుతోంది. కార్పొరేట్ జాబ్ వదిలిపెట్టి మరీ రైతుల బాగు కోసం వ్యవసాయం చేస్తున్న విశాలాక్షిని మనం నిజంగా అభినందించాల్సిందే కదా..!













