రానున్న మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు రూ.75,000 కోట్లకు చేరుకుని, త్వరలోనే రూ.1 లక్ష కోట్లను దాటుతాయి: భారత CSR విధాన రూపకర్త డా. భాస్కర్ చటర్జీ
దేశవ్యాప్తంగా జీవితాలను మార్చుతున్న శక్తివంతమైన అభివృద్ధి రంగంగా CSR ఎదిగింది: డా. భాస్కర్ చటర్జీ
భారత్‌లో 33 లక్షల నమోదిత స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి; కార్పొరేట్లు–సివిల్ సొసైటీ భాగస్వామ్యానికి అపార అవకాశాలు ఉన్నాయి: డా. భాస్కర్ చటర్జీ
సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్; ప్రివెంటివ్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏఐ ఆధారిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ప్రణాళికలు
సామాజిక సేవా కార్యక్రమాలకు నూతన నిధుల సమీకరణ మార్గాలపై చర్చించిన CSR రంగ ప్రముఖులు
హైదరాబాద్, జూలై 29, 2026: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ త్వరలో సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE) లో లిస్టింగ్ కానున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రివెంటివ్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన, 100 శాతం కృత్రిమ మేధ (AI) ఆధారిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు, దేశవ్యాప్తంగా క్యాన్సర్ మరియు నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) స్క్రీనింగ్ సేవలను విస్తరించే ప్రతిష్టాత్మక ప్రణాళికలను వెల్లడించింది.
బుధవారం రాత్రి హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో ఈక్విప్ప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (EQUIPPP) నిర్వహించిన “CSR Meets the Social Stock Exchange: A Journey Ahead” అనే విజ్ఞాన సదస్సులో ఈ ప్రకటన చేశారు.
ఈ కార్యక్రమానికి భారత కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డా. భాస్కర్ చటర్జీ, IAS (రిటైర్డ్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు, విద్యావేత్తలు, అభివృద్ధి రంగ నిపుణులు తదితరులు కలిపి 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా EQUIPPP వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. చిన్నబాబు సుంకవల్లి, ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆత్మకథ “వింగ్స్ ఆఫ్ ఫైర్” సహ రచయిత ప్రొఫెసర్ అరుణ్ తివారీ పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన డా. భాస్కర్ చటర్జీ, “CSR యొక్క అసలు లక్ష్యం సేవలు అందని వర్గాలకు సేవ చేయడమే” అని అన్నారు.
“కంపెనీల చట్టంలో CSR నిబంధనలను రూపొందించినప్పుడు ఈ రంగం ఇంత పెద్ద ఉద్యమంగా ఎదుగుతుందని నేను ఊహించలేదు. నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న కీలక అభివృద్ధి రంగంగా CSR రూపుదిద్దుకుంది” అని ఆయన పేర్కొన్నారు.
2013 కంపెనీల చట్టంలోని CSR నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు సుమారు 8,000 కంపెనీలు మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా ఏటా సుమారు రూ.9,000 కోట్ల CSR వ్యయం జరుగుతుందని అంచనా వేశామని తెలిపారు. అయితే ప్రస్తుతం 30,000కు పైగా కంపెనీలు CSR పరిధిలోకి వచ్చాయని, వార్షిక CSR వ్యయం రూ.40,000 కోట్లకు పైగా చేరుకుందని వెల్లడించారు.
“భారత్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, కంపెనీల లాభదాయకత పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లలో CSR నిధులు రూ.75,000 కోట్లకు చేరుకుని, ఆ తర్వాత త్వరలోనే రూ.1 లక్ష కోట్లను దాటుతాయి” అని ఆయన అంచనా వేశారు.
భారత్‌లో సుమారు 33 లక్షల నమోదిత స్వచ్ఛంద సంస్థలు (NGOs) ఉన్నాయని, కార్పొరేట్ సంస్థలు మరియు సివిల్ సొసైటీ సంస్థలు కలిసి పనిచేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అర్హత కలిగిన స్వచ్ఛంద సంస్థలు CSR నిధులు పొందేందుకు నమోదు ప్రక్రియ మరింత సులభమైందని చెప్పారు. అలాగే కంపెనీలు తమ వార్షిక CSR వ్యయంలో 10 శాతం వరకు జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) సాధనాల ద్వారా సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించిందని, ఇది సామాజిక రంగానికి పారదర్శక నిధుల సమీకరణలో కొత్త అధ్యాయమని వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. చిన్నబాబు సుంకవల్లి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్‌కు వెళ్తున్నది కేవలం నిధుల సమీకరణ కోసమే కాదని, సంస్థలో సుస్థిర పరిపాలన, పారదర్శకత, నియంత్రణ వ్యవస్థలు, ప్రభావ కొలత (Impact Measurement) మరింత బలోపేతం చేయడానికేనని తెలిపారు.
“మా వద్దకు వచ్చే ప్రతి రూపాయి సమాజంపై కొలవగలిగే ప్రభావాన్ని చూపేలా చేయడమే మా లక్ష్యం” అని ఆయన అన్నారు.
భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ, AI ఆధారిత ముందస్తు క్యాన్సర్ గుర్తింపు, గ్రామీణ ప్రాంతాల కోసం డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారాలు, మరిన్ని మొబైల్ స్క్రీనింగ్ బస్సులు, చివరి గ్రామం వరకు ఆరోగ్య సేవలు, ప్రివెంటివ్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, అలాగే ప్రివెంటివ్ ఆంకాలజీలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమానికి నేపథ్యాన్ని వివరిస్తూ EQUIPPP ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడుతూ, CSR, దాతృత్వం మరియు సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా సామాజిక ప్రభావాన్ని మరింత విస్తరించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించిందన్నారు.
సాంప్రదాయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీలు పెట్టుబడులు సమీకరించగా, సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనేది SEBI నియంత్రణలో పనిచేసే వేదిక. దీని ద్వారా అర్హత కలిగిన స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు దాతలు మరియు ఇంపాక్ట్ ఇన్వెస్టర్ల నుంచి పారదర్శకంగా నిధులు సమీకరించవచ్చు. అదే సమయంలో పాలన, జవాబుదారీతనం, సామాజిక ప్రభావంపై ఉన్నత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు.
ప్రభుత్వాలు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో EQUIPPP కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ ప్రక్రియ, నిబంధనలు, అవకాశాలు, సామాజిక ప్రభావ పెట్టుబడులపై నిపుణులు పాల్గొనేవారికి సమగ్ర అవగాహన కల్పించారు.








