త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత నాది : మంత్రి లోకేష్
నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు… స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని!
మైడియర్ జగన్ మళ్లీ చాలెంజ్ చేస్తున్నా… డేట్, టైమ్ ఫిక్స్ చెయ్
సిబిఐ విచారణ కోరుతున్న మీరు ఎందుకు స్టే తెచ్చుకున్నారు?
విధ్వంసమే వైసీపీ అజెండా… సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్
ఆదోని నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్
ఆదోని: సైకోకు టీచర్లంటే కోపం…అందుకే పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని. మైడియర్ జగన్.. మూడోసారి చాలెంజ్ చేస్తున్నా. టైమ్, డేట్ ఫిక్స్ చెయ్, మెగా డిఎస్సీపై చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆదోని నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… దొంగ సొమ్ముతో టీవి, పేపర్లు పెట్టింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గ్రూప్ -1 పేపర్లు లీకేజీ, మద్యం కుంభకోణంపై కూడా చర్చిద్దాం. మొన్న నేను జగన్ కు చాలెంజ్ చేస్తే చెంచాలు బయటకు వచ్చారు. సిబిఐ ఎంక్వయిరీ కావాలని అంటున్నారు. అంత ప్రేమ ఉంటే బాబాయి హత్యలో ఎందుకు స్టే తెచ్చుకున్నారు? అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకాకుండా ఎందుకు వాయిదాలపై వాయిదాలు కోరుతున్నారని వైఎస్ జగన్ ను లోకేష్ నిలదీశారు. డిఎస్సీ అంటే టిడిపి, టిడిపి అంటే డిఎస్సీ. 2లక్షలమంది ఉపాధ్యాయులను నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 150రోజుల్లో 250 కేసులు వేసినా 16వేల టీచర్ పోస్టులను విజయవంతంగా భర్తీచేశాం. మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన 16వేలమందిని తీసేయాలని పిల్ వేశారు. అందులో అధికంగా నష్టపోయేది కర్నూలు జిల్లా యువతే. ఇదంతా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది.
ఐదేళ్లు భోగాపురం ముఖం చూశారా?
అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా జగన్ భోగాపురం వైపు తొంగి చూడలేదు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను నాడు గాలికొదిలేసిన జగన్ ఇప్పుడు నేనే తెచ్చానని అంటున్నాడు. ప్రధాని ప్రారంభోత్సవానికి వస్తుంటే ఇప్పుడు నేనే తెచ్చానంటూ బయలుదేరాడు. లండన్ మందులు సరిగా పనిచేయనట్లుగా ఉంది. గొడ్డలి పార్టీ అధినేతకు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉంది. గూగుల్ మనం తెస్తే దావోస్ లో కలిసి తెచ్చా అంటున్నాడు. అదే నిజమైతే ఐదేళ్లు ఏంచేశారు? ఆర్సెలర్ మిట్టల్ తెస్తే అది రాదు, పక్కరాష్ట్రానికి వెళ్లింది అంటాడు. తీరా వచ్చాక నేనే తెచ్చా అంటాడు. మరికొద్దిరోజులు పోతే ఆగస్టు 15రోజున మా తాత స్వాతంత్రం తెచ్చాడని కూడా అంటాడు. ఇది క్రెడిట్ చోరీ డిజార్డర్ జబ్బు లక్షణం. కష్టపడి పనిచేయడంతోపాటు చేసింది ప్రజలకు చెప్పడం కూడా ముఖ్యం. ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. మనకు తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగురైతు, ఐటిడిపి వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైసిపికి కూడా గొడ్డలి, విధ్వంసం, బూతుల విభాగాలు ఉన్నాయి. అక్కడ హిట్ అండ్ రన్, భార్యను వేధించే సైకోలు, ల్యాండ్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, కిడ్నాప్ బ్యాచ్ లు ఉన్నారు. రెండు పార్టీలకు మధ్య తేడాను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది.
గొడ్డలి పార్టీకి ఫేక్ ప్రచారం చేసే అద్భుతమైన విభాగం ఉంది. లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య.
వారు ఫ్యాక్షన్ తెస్తే… మనం ఫైటర్ జెట్లు తెస్తున్నాం
సైకో హయాంలో రాయలసీమలో గొడ్డలి రాజ్యమేలింది. అంతకుముందు సొంత బాబాయిని లేపేసి నెపం మనపై వేశారు. ఫలితంగా ఓటమి పాలయ్యాం. మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తెచ్చాం. వారి హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కడప స్టీల్ ప్లాంట్ పనులను వేగంగా పరుగెత్తిస్తున్నాం. వారి హయాంలో సీమలో రక్తం పారిస్తే, మనం మిషన్ రాయలసీమ ద్వారా సస్యశ్యామలం చేస్తున్నాం. వారి హయాంలో ఫ్యాక్షన్ తెస్తే, మన హయాంలో ఫ్యాక్టరీలు, ఫైటర్ జెట్ లు, రాయల్ ఎన్ ఫీల్డ్ తెస్తున్నాం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్. రాయలసీమ ప్రజలు ఎక్కువగా బిందుసేద్యంపై ఆధారపడ్డారు. దీనిని గమనించి 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే, సైకో హయాంలో సబ్సిడీలు రద్దుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే ఆ కుటుంబాలను కనీసం పరామర్శించలేదు, నష్టపరిహారం అందించలేదు. అమర్ రాజా, జాకీ లాంటి పరిశ్రమలను తరిమేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మళ్లీ పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో జరిగిన విధ్వంసాన్ని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కారకర్తలపై ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమానికి మెటీరియల్ ఇచ్చాం. ప్రతిరోజు 30 ఇళ్లకు వెళ్లండి. మనం చేసిన మంచి పనిని ప్రజలకు చెప్పండి. వాళ్లు అడిగింది రాసుకోండి. మై టిడిపి యాప్ ద్వారా ప్రజలు ఏం చెప్పారో తెలియజేయండి.
కర్నూలు జిల్లా ప్రజల అభిమానం మరువలేను
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14నియోజకవర్గాల్లో 45రోజులపాటు యువగళంలో భాగంగా పాదయాత్ర చేశా. ఆనాడు మీరు చూపిన ప్రేమ, అభిమానం ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు పోలీసులు, రోప్ పార్టీ లేదు, నా వెనుక నిలబడింది పసుపు సైన్యమే. మేం ఈరోజు వేదికపైన కూర్చోవడానికి టిడిపి కార్యకర్తల త్యాగమే కారణం. ఆనాడు ఇక్కడకు వచ్చినపుడు ఆదోని ప్రజలు పనుల కోసం పొరుగుజిల్లాలకు వెళ్తున్నారు. తాగు,సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరారు.
గత డిఎస్సీలో ఎంపికైన టీచర్లలో 3వేలమందిని ఒక్క కర్నూలు జిల్లాకే కేటాయించాం. పరిశ్రమల్లో కూడా పెద్దపీట వేస్తున్నాం. కర్నూలు జిల్లాకే చెందిన టిజి భరత్ ను పరిశ్రమల మంత్రిని చేశాం. ఆయన ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కర్నూలు జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తున్నాం. టాటా సోలార్, డ్రోన్ సిటీ వంటివాటిని కర్నూలుకు తెచ్చాం.
కార్యకర్తే అధినేత…ఆచరణలో పాటిస్తున్నాం
2025 మహానాడులో నా గుండెకు దగ్గరైన శాసనం కార్యకర్తే అధినేత. దానిని ఆచరణలో అమలుచేస్తున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బాబుగారి పక్కన సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. కేంద్ర, రాష్ట్రమంత్రులు వేదిక ముందు కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. కార్యకర్త అధికారుల వద్దకు వెళ్లినపుడు సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలిచ్చాం.
ఆర్థిక ఇబ్బందులున్నా హామీలను నెరవేరుస్తున్నాం
ఆర్థిక ఇబ్బందులున్నా పట్టుదలతో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి. సంక్షేమం ఒక్కదానివల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదు. గోతులు పూడ్చడానికి 2వేలకోట్లు ఖర్చుచేశాం. చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. పథకాలు ఇస్తున్నామని అహంకారంతో మాట్లాడితే ప్రజలు సహించరు. ప్రజలవద్దకు వెళ్లి, వారితో మమేకం కావాలి. మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. దేశంలో మరే పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. కార్యకర్తలకు ఇన్సూరెన్స్, 5లక్షల ప్రమాదబీమా తెచ్చాం. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. గత ప్రభుత్వంలో టిడిపి కేడర్ పై పెట్టిన దొంగకేసులన్నీ పద్దతిప్రకారం తీసేస్తున్నాం. నీరుచెట్టు, ఉపాధి హామీ బిల్లులు క్లియర్ చేశాం. ఎక్కడైనా మిస్ అయితే పార్టీ ఆఫీసుకు రండి, పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం. కార్యకర్తల ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ తీసుకుంది.
రాష్ట్రం గాడిలో పడాలంటే మరో 3సార్లు కూటమి గెలవాలి
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. అందరం కలసికట్టుగా పనిచేయాలి. కనీసం మూడుసార్లు కూటమి ప్రభుత్వం గెలిస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం. దీర్ఘకాలం ఒకేపార్టీ అధికారంలో ఉండటం వల్లే గుజరాత్, ఒరిస్సా అభివృద్ధి చెందాయి. గొడ్డలిపార్టీ ఎన్ని కుట్రలు పన్నినా కూటమి పార్టీలం కలిసే ముందుకు సాగుతాం. రాష్ట్రం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.
యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత న్యాయవాదులు నన్ను కలిసి కర్నూలుకు హైకోర్టు కావాలని కోరారు, ఆచరణ సాధ్యం కాని హామీని ఇవ్వనని చెప్పా. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చా. రాబోయే రోజుల్లో హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా.
కష్టపడి పనిచేసేవారిని వెదికి మరీ పదవులు ఇస్తాం
తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. నాలుగుగోడల మధ్య పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నా తెలుగుదేశం – నా బాధ్యత కార్యక్రమం చేపట్టాం. నాయకులంతా బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. వ్యవస్థను పనిచేయించే బాధ్యత మేం తీసుకుంటాం. మీ స్థాయిలో కాకపోతే పైస్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లండి. ఏ పనిని మేం వదలిపెట్టడం లేదు. మై టిడిపిలో వివరాలు పొందుపర్చాలని చెప్పాం. ప్రతి ఫీడ్ బ్యాక్ సీరియస్ గా తీసుకుంటున్నా. పాదయాత్రలో కార్యకర్తలు పనిచేసేవారిని గుర్తించాలని అడిగారు. నామినేటెడ్ పదవులు కార్యకర్తలను వెదుక్కుంటూ వెళ్లి ఇచ్చాం. మీరు చేసిన ప్రతి కార్యక్రమం మై టిడిపి ద్వారా తెలియజేయండి. డోర్ టు డోర్ ద్వారా ఏ బూత్ లో ఎవరిని కలిశారో వివరాలు తెలుస్తాయి. పట్టుదల, క్రమశిక్షణతో పనిచేస్తే వెదుక్కుంటూ వచ్చి పదవులు ఇస్తాం.
ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు
నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు చాలా కోరికలు కోరారు. నా శాఖకు సంబంధించిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, ఐటిఐ మంజూరుకు కృషి చేస్తాను. ఉర్దూ జూనియర్ కళాశాలను కోరారు. రాబోయే డిఎస్సీలో ఉర్దూ టీచర్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం. త్వరలో ప్రారంభించే బాధ్యత తీసుకుంటాం. ఆదోనికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను. పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పనిచేయనివారిని దండం పెట్టి మార్చేస్తా. మొహమాటం బాబు గారిది, నాది కాదు. మనసులో ఉన్నది చెబుతా. అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్నట్లే పనిచేయాలి. కలసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసుకుందామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారీ పరిశ్రమల మంత్రి టిజి భరత్, నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలు గుడిసె కిష్టమ్మ, నియోజకవర్గ పరిశీలకులు కేశవరెడ్డి పాల్గొన్నారు.








