తెలంగాణలో పట్టభద్రుల పోరు!
* 2027 మార్చిలో ఖాళీ కానున్న 2 స్థానాలు
* అభ్యర్థులను ప్రకటించి జోరుమీదున్న కాంగ్రెస్
* అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్, బీజేపీ బిజీబిజీ
* శరవేగంగా సాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ
తెలంగాణలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికలకోసం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా చట్టసభల్లో బలం పెంచుకోవాలని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికలకోసం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన వాటికంటే ముందంజలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమకు కలిసొస్తాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక విద్యావంతులు తమ పార్టీని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం బీజేపీలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున సురభి వాణిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గానికి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్లిద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగుస్తుంది. కాబట్టి ఈలోపు ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఓటరు నమోదు ప్రక్రియ షురూ!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. గత ఓటర్ల జాబితాతో సంబంధంల ేకుండా పూర్తిస్థాయిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. గతంలో ఓటర్లుగా ఉన్న వాళ్లు కూడా మళ్లీ ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 6 వరకూ ఓటర్ల దరఖాస్తులను స్వీకరించనుంది. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంది. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 లోపు ఎన్నికల సంఘం స్వీకరిస్తుంది. అనంతరం డిసెంబర్ 30న ఫైనల్ ఓటరు లిస్ట్ ను విడుదల చేస్తుంది. పట్టభద్రుల ఓట్లలో నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ నమోదులను అరికట్టేందుకు ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రధాన పార్టీల వ్యూహాలు
కాంగ్రెస్ స్పీడ్:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు స్థానాలనూ కైవసం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదును పర్యవేక్షించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 77 మంది ఇన్ ఛార్జ్ లను ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నియమించిందంటే.. వీటిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన పార్టీలకంటే ముందుగా ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ- ఖమ్మం- వరంగల్ స్థానం నుంచి దివంగత నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డిని ప్రకటించింది. అలాగే మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని ఖరారు చేసింది.
బీఆర్ఎస్ పక్కా ప్లాన్:
గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలపై పాత పట్టును నిరూపించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. నిరుద్యోగులు, పట్టభద్రులలో ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ దళం వ్యూహరచన చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ గ్రాడ్యుయేట్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలనూ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో, బీసీలకు బరిలోకి దించడం ద్వారా వాళ్ల ఆదరణ పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పెద్ద కసరత్తే చేస్తోంది. త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది.
అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు:
నగరాలు, పట్టణలతో పాటు విద్యావంతుల్లో తమకు పట్టు ఉందని బీజేపీ భావిస్తుంటుంది. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపికకోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ, ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇందులో మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ స్థానం నుంచి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రా రావు వైపే మెజారిటీ నేతలు మొగ్గు చూపారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అనుభవం రామచంద్రరావుకు ఉంది. అందుకే ఆయన బరిలోకి దిగితేనే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఈ స్థానం నుంచి రామచంద్రరావు పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానం నుంచి కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, త్వరలోనే స్పష్టత రానుంది.
నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి
వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి ఇప్పటికే ప్రచార పర్వంలోకి దూసుకెళ్తుండగా, విపక్షాలు ఇక్కడ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రభావం చూపనున్నాయి. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఓటర్ల నమోదుపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి.
శాసనమండలిలో బలనిరూపణకు, రాబోయే రాజకీయ సమీకరణాలకు ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్లా మారాయి. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత ఎన్నికల అసలు వేడి రాజుకోనుంది. అధికార కాంగ్రెస్ తన విజయపరంపరను కొనసాగించాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుని తమ సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.








