మెడికల్ టూరిజంపై తెలంగాణ సర్కారు ఫోకస్..విదేశీయుల కోసం ప్రత్యేక వార్డులు
Medical Tourism: తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రులైన నిమ్స్, టిమ్స్, గాంధీ, ఉస్మానియాలలో విదేశీ రోగులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని (వైద్య పర్యాటకం) ప్రోత్సహించడానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా..
ప్రస్తుతం అత్యధిక శాతం విదేశీయులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నప్పటికీ, ఢిల్లీ, ముంబైల తర్వాత హైదరాబాద్ వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఉదాహరణకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మోకీళ్ల మార్పిడి చికిత్సకు రూ. 6-7 లక్షలు వసూలు చేస్తుంటే, నిమ్స్‌లో రూ. 2 లక్షల లోపే పూర్తి చేస్తున్నారు. అలాగే ప్రైవేట్‌లో బైపాస్ సర్జరీకి రూ. 7-8 లక్షలు ఖర్చవుతుండగా, నిమ్స్‌లో రెండున్నర లక్షల లోపే అందిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్..
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, సిబ్బంది జవాబుదారీతనాన్ని పెంచి విదేశీ రోగులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా, ప్రతి ఆసుపత్రిలో విదేశీయుల కోసం కొన్ని ప్రత్యేక పడకలు, వార్డులను కేటాయించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న టిమ్స్ (TIMS) లో ప్రత్యేక ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. విదేశీ రోగులకు అందించే సేవలు, ప్యాకేజీలు , ధరల విధానాన్ని నూతన కమిటీ అధ్యయనం చేయనుంది.
ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం..
ఈ ప్రతిపాదనలో భాగంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల లభ్యత వివరాలను పరిశీలిస్తే.. నిమ్స్ ఆసుపత్రి అత్యధికంగా 2 వేల పడకలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో 1800 పడకలు, ఉస్మానియా ఆసుపత్రిలో 1500 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలో ప్రారంభం కానున్న టిమ్స్ (TIMS) ఆసుపత్రిలో 1000 పడకల సామర్థ్యం కలదు.








