సింగరేణికి శాపంగా ఆ రెండు పార్టీలు : కిషన్ రెడ్డి
సింగరేణి (Singareni) ఉత్పత్తి, ఆదాయం పడిపోయాయని, ఈ పరిస్థితికి పదేళ్ల బీఆర్ఎస్ పాలన కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా ఆయన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, మణుగూరు సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌లకు సింగరేణి బంగారు బాతుగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణికి రూ.25వేల కోట్ల అప్పు మిగిల్చిపోగా, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ( Congress) మరో రూ.26వేల కోట్లు అప్పు చేసిందన్నారు.గతంలో సింగరేణి నిధులను హరీశ్‌రావు సిద్దిపేటకు తీసుకెళ్తే, నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సంస్థ పాలిట శాపంగా మారాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణికి చేసిన మేలు, సాధించిన ఘనత ఏంటని ఆయన ప్రశ్నించారు. మెస్సితో ఫుట్‌బాల్ ఆడటానికి సింగరేణి నిధులను వాడుకోవాల్సిన అవసరమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) సింగరేణికి ఎలాంటి వేలంపాట లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా తాడిచర్ల-2 బ్లాకును కేటాయించారని ఆయన గుర్తు చేశారు.








