తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం
గిగ్ వర్కర్లకు (Gig workers) అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి, వారి పని వాతావరణాన్ని మెరుగుపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హైదరాబాద్ మహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వారికి ఐదు ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, అమెజాన్ (Amazon) ఇండియా మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. సచివాలయంలో పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజం, ఆర్థిక వ్యవస్థ నిరంతరం ముందుకు సాగేందుకు తమ శ్రమతో కృషి చేస్తున్న గిగ్ వర్కర్లు ప్రజా ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన వారని, అందుకే వారి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అమెజాన్ ఇండియాతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఆశ్రయ్ కేంద్రాలు వివిధ డిజిటల్ వేదికలకు చెందిన గిగ్ వర్కర్లు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి, శారీరకంగా ఉపశమనం పొందడానికి, తిరిగి ఉత్సాహంగా విధుల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడతాయని అన్నారు. డిజిటల్ ఎకానమీని ముందుకు నడిపిస్తున్న గిగ్ వర్కర్ల వల్లే ఆధునిక జీవనం అందరికీ సజావుగా సాగుతుందని చెప్పారు. ఆశ్రయ్ కేంద్రాల ఏర్పాటుతో హైదరాబాద్ మరింత మానవీయమైన మహానగరంగా మారుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన అమెజాన్ ఇండియాను ముఖ్యమంత్రి అభినందించారు. అమెజాన్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆశ్రయ్ కింద సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని కొండాపూర్ (Kondapur), తెల్లాపూర్, పటాన్చెరు, భారతినగర్, చందానగర్ (Chandanagar) ప్రాంతాల్లో ఎయిర్ కండిషన్డ్(ఏసీ) విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.








