అరకు కాఫీకి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు
మన అరకు (Araku Coffee) కాఫీకి అంతర్జాతీయ వేదికలపైనా గుర్తింపు దక్కుతోంది. తాజాగా స్వయంగా ప్రధాని మోదీ (Modi) మన అరకు కాఫీకి సరికొత్త గుర్తింపును తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese)ను కలిశారు. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఓ బహుమతి ఇచ్చారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీకి భారతదేశపు ప్రీమియమ్ కాఫీ గిఫ్ట్ బాక్స్‌ను అందజేశారని, మన విభిన్న భూభాగాలు, విలక్షణమైన ప్రక్రియల ద్వారా రూపుదిద్దుకున్న విశిష్టమైన రుచులతో భారతదేశపు గొప్ప వారసత్వాన్ని ఇది చాటి చెబుతుందన్నారు. ఈ బహుమతి ద్వారా ప్రపంచ స్థాయి, సుస్థిర పద్ధతుల్లో పండించిన కాఫీ ఉత్పత్తిదారుగా మన దేశ స్థాయిని ప్రతిబింబిస్తుందన్నారు. అలాగే ఇది ప్రతి రైతు నుంచి అమ్మకం దారుల వరకు వారి, వారి అంకితభావాన్ని గౌరవిస్తుంది అన్నారు.
పీయూష్ గోయల్ ట్వీట్‌పై టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు (Srikrishnadevarayalu) స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధానిమంత్రికి బహూకరించిన ఇండియన్ ప్రీమియం కాఫీ బాక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీని చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారతదేశపు గొప్ప కాఫీ వారసత్వానికి మంచి గుర్తింపని, ఇందులో అరకు యొక్క విశిష్టమైన రుచి, దాని గిరిజన రైతుల అంకితభావం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఈ కాఫీని ఎప్పటికి మరపురానిదిగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము అన్నారు.








