హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బ్రిటన్‌కు చెందిన అట్రాక్షన్ టికెట్.కామ్ నిర్వహించిన సర్వేలో కుటుంబాలకు అనుకూలమైన విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ విమానాశ్రయం (Hyderabad Airport) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అట్రాక్షన్ టికెట్.కామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ పరిశీలనలో 140కు పైగా అంతర్జాతీయ విమానాశ్రయాలను పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, పిల్లలకు అనుకూలమైన వాతావరణం ఉందా, ప్రయాణికుల భద్రత ఎలా ఉంది, విశ్రాంతి సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయి వంటి అనేక అంశాలను పరిశీలించారు.
ఈ సర్వేలో విమానాశ్రయ విస్తీర్ణం, పిల్లల ఆట స్థలాలు, చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ప్రయాణికులకు అందించే సేవలు, ఉచిత వైఫై సదుపాయం, భద్రతా ఏర్పాట్లు, గూగుల్ (Google) సమీక్షలు వంటి అంశాల ఆధారంగా విమానాశ్రయాలకు రేటింగ్‌లు కేటాయించారు. ఈ ప్రమాణాలన్నింటిలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగైన పనితీరు కనబరిచింది. 20 పాయింట్లకు నిర్వహించిన ఈ రేటింగ్‌లో హైదరాబాద్ విమానాశ్రయం 18.5 పాయింట్లు సాధించింది. దీంతో కుటుంబాలకు అనుకూలమైన ప్రపంచ విమానాశ్రయాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.ఈ గుర్తింపు రావడంపై జీఎంఆర్ (GMR) హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సంస్థ సిబ్బంది నిబద్ధత, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యానికి ఇది నిదర్శనమని విమానాశ్రయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కదీర్ కదిరవన్ (Kadeer Kadhiravan) తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.








