వ్యర్థాల నుండి హైడ్రోజన్ ఇంధనం.. ఇక వంట గ్యాస్ ధరల భారం దిగిపోవాల్సిందే!
JNTU : పారేసే వృధా జలాలు, కుళ్లిన పండ్లు, కూరగాయల వ్యర్థాల నుంచి సరికొత్త ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దిశగా జేఎన్టీయూ (JNTUH) పరిశోధకులు ముందడుగు వేశారు. జేఎన్టీయూ శతాబ్ది ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు కలిసి ఈ వ్యర్థాల ద్వారా ‘హైడ్రోజన్ ఇంధనాన్ని’ విజయవంతంగా రూపొందిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా, దీనిని పూర్తిగా మీథేన్ రహిత బయో గ్యాస్‌గా తయారు చేస్తుండటం విశేషం.
నేరుగా గ్యాస్ స్టవ్‌కు పంపి..
ప్రస్తుతం మనం వంట ఇంట్లో వినియోగిస్తున్న ఎల్పీజీ (LPG) సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఇంధనాన్ని సిలిండర్లలో నింపి, ప్రత్యేకమైన పైపుల ద్వారా నేరుగా గ్యాస్ స్టవ్‌కు పంపి వంట చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా స్వచ్ఛమైన నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొట్టి ఇంధనాన్ని తయారు చేస్తారు. అయితే, అలా కాకుండా నిత్యం వృధాగా పోయే మురుగునీరు, కూరగాయల వ్యర్థాలతో ఎందుకు చేయకూడదనే ఆలోచనతో ఈ ప్రయోగాలు ప్రారంభించినట్లు జేఎన్టీయూ ఎన్విరాన్మెంట్ విభాగం ఆచార్యులు వి.హిమబిందు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రయోగ దశలో ఉంది.
ఉష్ణోగ్రతను పెంచే మీథేన్‌కు చెక్..
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆహార వ్యర్థాల నుండి బయో ఇంధనాన్ని తయారు చేసేటప్పుడు.. ఆ బయోగ్యాస్‌లో స్వల్పంగా మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ మీథేన్ గాలిలో కలవడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జేఎన్టీయూ ఎన్విరాన్మెంట్ విభాగం భిన్నంగా ఆలోచించింది. నీరు, బొగ్గుపులుసు వాయువుగా ఉన్నప్పుడు కేవలం నీటిని మాత్రమే తీసుకుని.. అందులోని ప్రాణవాయువు (ఆక్సిజన్), హైడ్రోజన్‌ను విడగొట్టి ఈ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. దీనివల్ల మీథేన్ వాయువు అసలు బయటకు రాదు. ఫలితంగా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.
వ్యర్థాలను సేకరించి ప్రయోగాలు..
మెరుగైన ఫలితాలు సాధించడం కోసం పరిశోధక విద్యార్థులు వివిధ రకాల శాస్త్రీయ పద్ధతులను (డార్క్ ఫెర్మెంటేషన్, ఫోటో ఫెర్మెంటేషన్, మైక్రోబియల్ ఎలక్ట్రోలిసిస్, ఫోటో కెమికల్ హైడ్రోజన్ విధానాలు) ఎంచుకున్నారు. ఇందుకోసం రైతుబజార్లు, హోటళ్లు, డిస్టిలరీస్, బ్రేవరేజెస్ వంటి ప్రాంతాల నుండి వృధా జలాలు, కుళ్లిన పండ్లు, ఆహార వ్యర్థాలను సేకరించి ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు అన్నీ ఆశించిన విధంగా విజయవంతమయ్యాయి.
ఒకటి రెండేళ్లలో అందుబాటులోకి..
ఆహార వ్యర్థాలను, మట్టిని వేర్వేరు పాలు (శాతాలు) లో కలపడం ద్వారా మరింత మెరుగైన ఫలితాల కోసం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వ్యర్థాలకు స్లడ్జ్‌ను కలిపి చేస్తున్న ప్రయోగాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ సరికొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా రాబోయే ఒకటి లేదా రెండేళ్ల కాలంలోనే పూర్తిస్థాయి ఉదజని (హైడ్రోజన్) ఇంధనం అందుబాటులోకి వస్తుందని పరిశోధక విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








