రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కేటీఆర్ డ్రామాలు : ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) నిర్వహించింది యువ సంగ్రామ సదస్సు కాదని, యువతను రెచ్చగొట్టే సదస్సు అని ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి అనేక మంది బలిదానాలకు కారణమయ్యారు. శనివారం నిర్వహించిన సదస్సులో యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వేదికపై వికృతంగా మాట్లాడుతున్న వాళ్లను కేటీఆర్ (KTR) వారించకుండా చూస్తు కూర్చున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. పేపర్ లీక్‌లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి నియామకపత్రాలు అందజేశాం. అంగన్వాడీ (Anganwadi), పోలీస్‌శాఖతో పాటు అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. భవిష్యత్తులో మరికొన్ని ఇస్తాం. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. పేపర్లు లీక్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ( KCR)ది అని విమర్శించారు.








