సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్..
ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన స్ఫూర్తిని పంచాలని చాలా కాలంగా గౌడ సోదరులు అడుగుతున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో నెక్లెస్ రోడ్డుకు వెళ్లి పరిశీలించాను. అక్కడ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించాను.
ట్యాంక్ బండ్ పైన ఉన్న పర్యాటక కార్యాలయాన్ని కూల్చివేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించాను.
పర్యాటకులు, సందర్శకులు ట్యాంక్ బండ్ పైకి వచ్చినప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దర్శనం జరిగి, ఆయన స్ఫూర్తి వారిలో నిండాలని కోరుకున్నాను.
బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదు.
బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి.
మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు.
బ్రిటిష్ లైబ్రరీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విశేషాలు ఉన్నాయి. అక్కడి నుంచే మనం ఆయన చరిత్రను తెలుసుకున్నాం.
బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది.
వందల ఏళ్లు గడిచినా ఆయనను తలుచుకుంటున్నామంటే ఆయన పోరాటం ఎంత అద్భుతమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఈ అద్భుతమైన విగ్రహాన్ని కాపాడుకునే బాధ్యత గౌడ సోదరులదే. నిత్యం స్ఫూర్తిని నింపేలా జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
విగ్రహం దగ్గర మంచి వెలుగుల ఏర్పాట్లతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇస్తున్నాను.
తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాయిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రాధాన్యత ఉంటుంది.
పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.
ఈ ప్రభుత్వం నాది కాదు. సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది.
బాలా గౌడ్, మల్లికార్జున్ గౌడ్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు.
మహేష్ గౌడ్ గాంధీభవన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా నేను మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి.
గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను.
ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తాం. కాలువ గట్లపైన కూడా ఈత, తాటి చెట్లు నాటాలి.
నల్గొండ జిల్లాలో గౌడలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పదేళ్లు పరిపాలించిన వాళ్లు తమ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు.
బర్రెలు, గొర్రెలు పెంచుకోండి, చెప్పులు కుట్టుకోండి, చేపలు పట్టుకోండి అని గత ప్రభుత్వం చెప్పింది.
మనం బర్రెలు, గొర్రెలు పెంచుకుంటుంటే వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలుతారని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు.
తరతరాలుగా అందివచ్చిన కులవృత్తి ఇది. దీనితోనే పిల్లలను చదివించుకున్నారు.
ఆ వర్గాల పిల్లలు చదివి వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్‌లుగా మారి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆనాడు నేను చెప్పాను.
పిల్లల తలరాతలను మనం మార్చవచ్చు. ఈనాడు చైతన్యం వచ్చింది.
చదువుకోవడం వల్ల మధు యాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు.
కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి.
విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తాం.
గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం.
మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.
ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు రెండు వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నాం.
గౌడ సోదరులకు యాభై వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం.
ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం.
ఈ ప్రభుత్వం మనది అని చెప్పండి. రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేశాం.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రులయ్యారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొన్నం, వాకిటి, సీతక్క, కొండా సురేఖ మంత్రులయ్యారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సంతోష్ రావును రాజ్యసభకు పంపారు.
నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపాను. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపాను.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోద్ రావును ప్రణాళికా సంఘం ఛైర్మన్ చేశారు.
నేను కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేశాను.
కేసీఆర్ సీఎం అయితే తన బిడ్డను ఎంపీ, ఎమ్మెల్సీ చేశాడు..
నేను వీరనారి చాకలి ఐలమ్మ మనుమరాలిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాను.
కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం.
కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం.
చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.
వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు.
మేం గ్రామ గ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.
కేసీఆర్ పదేళ్లలో కడితే ఇరవై లక్షల ఇళ్లు నిర్మాణం అయ్యేవి. కానీ ఆయనకు పేదోడి ఇంటిపై ఆలోచన లేదు.
దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదు. ఈ ప్రభుత్వం మీది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి.
ప్రగతి భవన్, సచివాలయానికి ఎవరినీ రానివ్వలేదు. అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం.
బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం.
ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల అప్పు మాకు ముప్పుగా మారింది. ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీని కేసీఆర్ అప్పులకు కడుతున్నాం.
ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.
తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం.
అరవై వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం.
యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నాం.
మేం చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారు. చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడు.
కరువు రావాలని, రైతులు నష్టపోవాలని చేతబడి పూజలు చేస్తున్నారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?
చేతబడి చేసేవాళ్లను చెట్లకు కట్టేసి కొట్టాలి.
ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. ఈ ప్రభుత్వం మనది.








