శ్రీవారి భక్తులకు అలెర్ట్, నేరుగా క్యూలైన్లలోకి అనుమతి..!
కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని భావిస్తున్న సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ల వద్ద ఈరోజు అంటే బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (SSD) టోకెన్ల ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రద్దీ నియంత్రణ మరియు సాంకేతిక/పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుపతిలోని వివిధ కేంద్రాల వద్ద ఉచిత సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్లలో వేచి ఉంటారు. అయితే ఈరోజు టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేయడంతో, కౌంటర్ల వద్దకు చేరుకునే భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. టోకెన్లు లేని కారణంగా భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. టోకెన్లు లేకుండా నేరుగా ఉచిత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు కనీసం 17 నుండి గరిష్టంగా 23 గంటల వరకు సమయం పడుతోంది.
సామాన్య భక్తులు తమ వెంట తగినంత ఆహారం, పాలు, మందులు ఉంచుకోవాలని అధికారులు సూచించారు. టోకెన్ల జారీ నిలిపివేత నేపథ్యంలో.. భక్తులు ఈరోజు మరియు రేపు అంటే గురువారం నేరుగా తిరుమల కొండపైకి చేరుకుని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఎలాంటి టోకెన్లు లేకుండానే నేరుగా స్వామివారి సర్వదర్శనం చేసుకోవచ్చని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేని భక్తులను నిర్దేశిత క్యూలైన్ల ద్వారా కంపార్ట్మెంట్లలోకి అనుమతించి, శ్రీవారి దర్శ భాగ్యం కల్పిస్తామని, భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
బుధవారం టోకెన్ల కోటా రద్దయినప్పటికీ, మళ్లీ గురువారం ఉదయం, యథావిధిగా కౌంటర్లు తెరుచుకోనున్నాయి. శుక్రవారం నాటి శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను గురువారం తిరుపతిలోని మూడు కేంద్రాల్లో జారీ చేస్తారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ దర్శన సమయాలు, రద్దీని ముందే గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికను మార్చుకోవాలని, టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానమ్స్ లోని సూచనలను ఫాలో అవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.








