ఆగస్ట్ 15న ఉత్తమ అధికారి అవార్డు..ఐదు రోజులకే ఏసీబీకి రెడ్ హ్యాండెడ్..!
ఆంధ్రప్రదేశ్లో అవినీతి తిమింగలాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో లంచగొండి అధికారిని వలపన్ని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నరేంద్రను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక కొత్త ఇళ్లకు మున్సిపల్ పన్ను విధించేందుకు గాను సదరు బాధితుడి నుండి ఏకంగా రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు నరేంద్రపై ఆరోపణలు వచ్చాయి.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఆర్ఐ నరేంద్ర లంచం సొమ్ము తీసుకుంటుండగా దాడి చేసి నగదుతో సహా పట్టుకున్నారు. అయితే ఈ అవినీతి వేటలో అత్యంత ఆసక్తికరమైన, చర్చనీయాంశమైన విషయం మరొకటి ఉంది. ఈ అవినీతి అధికారి నరేంద్ర కేవలం ఐదు రోజుల క్రితం, అంటే ఆగస్టు 15న జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ‘ఉత్తమ అధికారి’ (Best Officer) గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారంటూ ప్రభుత్వం నుండి అధికారికంగా అవార్డు అందుకున్న ఈ అధికారి.. ఇంతలోనే లంచం తీసుకుంటూ దొరికిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒకవైపు ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో లంచాల పర్వం సాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున మెరిటోరియస్ సర్టిఫికేట్ అందుకున్న అధికారి, వారం తిరక్కుండానే ఏసీబీ కేసులో జైలు పాలవ్వడం ఇప్పుడు ప్రకాశం జిల్లా అంతటా మరియు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. నిందితుడు నరేంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కార్పొరేషన్ కార్యాలయంలో తదుపరి విచారణను ముమ్మరం చేశారు.








