వెలిగొండ నిర్వాసితులకు చంద్రబాబు గుడ్ న్యూస్..!
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project) ముంపు బాధితులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈనెల 24వ తేదీ లోపు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేతుల మీదుగా 1600 ముంపు బాధిత కుటుంబాలకు ఏకంగా రూ.200 కోట్ల భారీ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి విడత కింద 2,565 ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం డబ్బులను విజయవంతంగా చెల్లించింది. మిగిలిన వారందరికీ కూడా ఈనెల 24 లోపు ప్యాకేజీ సొమ్మును అందజేసి పునరావాస ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్ను కూడా ప్రభుత్వం వెల్లడించింది. నిర్వాసితులకు ప్యాకేజీ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఈ నెలాఖరు నాటికి నల్లమల్లసాగర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందనుంది. దశాబ్దాల నాటి వెలిగొండ కల సాకారం కాబోతుండటంతో అటు నిర్వాసితుల్లోనూ, ఇటు రాయలసీమ, ప్రకాశం ప్రాంత ప్రజల్లోనూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.








