జోగి ఫ్యామిలీకి బెయిల్ వస్తుందా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ముందస్తు బెయిల్ పిటిషన్పై విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ ముగిసింది. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన గృహహింస, వరకట్న వేధింపుల కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరువైపాల వాదనలను విన్న గౌరవ న్యాయమూర్తి, ఈ పిటిషన్పై తీర్పును ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
జోగి రమేష్ కుటుంబంలో తలెత్తిన అంతర్గత వివాదాలు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాయి. జోగి రమేష్ కోడలు మేఘన ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్(Jogi Rajiv) మరియు ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, మోసం, వరకట్న వేధింపులతో పాటు గృహహింస నిరోధక చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) గట్టి వాదనలు వినిపించారు. జోగి రమేష్ సాధారణ వ్యక్తి కాదని, ఆయనపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 60కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ఇలాంటి తరుణంలో ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు జోగి రమేష్ తరపు న్యాయవాది ఈ వాదనలను తోసిపుచ్చారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, కుటుంబ వివాదాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో అందరి దృష్టి ఈనెల 21న కోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే నెలకొంది.








