రెండు వారాల్లో రజనీ కొత్త పార్టీ
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో పక్షం రోజుల్లో కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలికాలంలో తాను రెండుసార్లు రజనీకాంత్‌తో సమావేశమై రాష్ట్రంలో నెల కొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంతో గౌరవమర్యాదలతోపాటు, ప్రేమాభిమానాలు ఉన్నాయని చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు కాదని, తనను పెంచి పోషించిన ప్రజలకు తనకు చేతనైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనేనని చెప్పారు. మరో పక్షం రోజుల్లో రజనీ కచ్చితంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని, పార్టీ స్థాపనపై ఒక సృష్టమైన ప్రకటన చేశాక, తన సిద్ధాంతాలు, ఆశయాలను వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నారు.













