హెచ్-1బి తో ఒక్క భారతీయుడు ఉద్యోగం కోల్పోలేదు : సుష్మా
అమెరికా కొత్త హెచ్-1బి విధానం వల్ల అక్కడున్న భారతీయులెవరూ ఉద్యోగాలు కోల్పోకుండా చూసేందుకు యూఎస్‌తో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని విదేశాంగ మంత్రి సుష్యాస్వరాజ్ తెలిపారు. రాజ్యసభలో మంత్రి మాట్లాడుతూ యూఎస్ యంత్రాంగం, కాంగ్రెస్ సభ్యులతో తాము చర్చలు జరుపుతున్నామని, ఇంతవరకూ ఒక్క భారతీయుడు కూడా ఉద్యోగం కోల్పోలేదని అన్నారు. హెచ్-1బి వీసా ఆంక్షలు, ఉద్యోగ భద్రతపై ఇండియన్ ఐటి నిపుణులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నామన్నారు. హెచ్-1బి వీసా ఆంక్షలపై ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లో నాలుగు బిల్లు ఉన్నాయని, బిల్లులు పాస్ కాకుండా అత్యున్నత స్థాయిలోనూ, దౌత్య మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇండియన్ ప్రొఫెషనల్స్ భార్యలకు వీసా సౌకర్యం కొనసాగించడాన్ని అమెరికా ఇంతవరకూ ఉపసహరించలేదని అన్నారు.













