నిజాయితీపరులకు ఒక్క చాన్స్ ఇవ్వొచ్చుగా!
రకరకాల కారణాలవల్ల పాత నోట్లను జమ చేసుకోలేని సామాన్యులు, నిజాయితీపరులకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇలాంటి వారికి మరొక్క రెండు వారాలు గడువు ఇవ్వడం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్కు ఈ విషయం తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో సుధా మిశ్రా అనే మహిళ సహా అనేక మంది పిటిషన్లు వేశారు. గడువులోపు తాము పాట నోట్లు జమచేయలేకపోయామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్టపరంగా సంపాదించిన వారు చేయని తప్పునకు డబ్బు నష్టపోయే పరిస్థితి రావొద్దు. ఉదాహరణకు పాత నోట్ల జమ చేసేందుకు ఇచ్చిన గడువు సమయంలోనే ఒక వ్యక్తి జైలులో ఉన్నాడనుకుందాం. అతని పరిస్థితి ఏమిటి? అలాంటి వారికి ఎందుకు అవకాశం కల్పించరు? అని ప్రశ్నించింది. అయితే దీనిపై సమాధానం చెప్పేందుకు తమకు కొంత గడువు కావాలని సోలిషిటర్ జనరల్ కోరారు. ఒక్కో కేసును పరిశీలించాల్సి ఉందన్నారు.
గత ఏడాది నవంబరు 8న పాత 500, వెయ్యి నోట్లను రద్దు చేసింది. డిసెంబర్ 30వ తేదీలోపు వాటిని బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ గడువు సమయంలో విదేశాల్లో ఉన్న వారికి, సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న రక్షణ సిబ్బందికి మార్చి 31 వరకు సమయం ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి మరో అవకాశం ఇవ్వొచ్చు కదా అని మార్చి 21న కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. గడువు పొడిగించలేమంటూ కేంద్రం అప్పుడే సమాధానమిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా సూచనలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.








