పళనిస్వామిపై విశ్వాసం లేదు..
ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు మంగళవారం 19 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును చెన్నైలోని రాజ్‌భవన్‌లో కలసి లిఖితపూర్వకంగా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. తన వర్గం ఎమ్మెల్యేలతో దినకరన్ మంగళవారం ఉదయం 8 గంటలకు సమావేశమయ్యారు. 9.30 గంటలకు ఏడు కార్లలో 19 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి 10 గంటలకు గవర్నర్‌ను కలుసుకున్నారు. ఎమ్మెల్యేలంతా విడివిడిగా మద్దతు ఉపసంహరణ లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. వాటిని పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. ‘‘మా వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు చర్యలు ప్రారంభించాం’’అని దినకరన్ మద్దతుదారు, అండిపత్తి ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ గవర్నర్‌ను కలసిన అనంతరం ప్రకటించారు.








