1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
చాలా కాలంగా ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించని 1.62 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆరుణ్ జైట్లీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు వ్యాపార లావాదేవీలు నిర్వహించని పరిశ్రమలను ‘డొల్ల కంపెనీలు’గా గుర్తిస్తామన్నారు. దీనికి పరిశ్రమల చట్టం వర్తించదని తెలిపారు. పరిశ్రమల చట్టంలోని సెక్షన్ 248 ప్రకారం జులై 12 వరకు 1,62,618 కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కొందరు వ్యక్తులు తమ నల్లధనాన్ని దాచుకోవడానికి నకిలీ పరిశ్రమలను స్థాపిస్తున్నారనీ, వీటి ద్వారా ఎటు వంటి లావాదేవీలు జరగడం లేదని అన్నారు. సదరు సంస్థలపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల చట్టంలోని సెక్షన్ 248 ప్రకారం ఏదైనా కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం పరిశ్రమల రిజిస్టార్లకు ఉంటుంది.








