డిసెంబర్లో కొత్త రూ.1000 నోటు?
ప్రభుత్వం మళ్లీ 1,000 రూపాయల కరెన్సీ నోటును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందా? గతేడాది నవంబర్లో 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్త డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్తో 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. ఇటీవలనే 200 రూపాయల నోటును కూడా మార్కెట్లోకి తెచ్చారు. ప్రస్తుతం 500 రూపాయల నోటుకు 2,000 రూపాయల నోటుకు మధ్య డినామినేషన్లో కరెన్సీ నోట్లు లేవు. అందువల్ల కొత్త ఫీచర్స్, సరికొత్త డిజైన్లో మళ్లీ 1,000 రూపాయల నోటును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన ఉందని డిఎన్ఎ పత్రిక విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ కొత్త నోటు ప్రింటింగ్ త్వరలోనే మొదలవుతుందని కూడా పేర్కొంది. కొత్త నోటుకు సంబంధించిన డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్, పేపర్ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్లో కొత్త 1000 రూపాయల నోటు మళ్లీ వచ్చే అవకాశం ఉందని కూడా డిఎన్ఎ వెల్లడించింది.








