డిసెంబర్ 12న రజనీ పార్టీ?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని గత కొన్ని రోజులుగా తమిళనాట జరుగుతున్న ప్రచారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల ఫ్యాన్స్‌తో భేటీ అయిన సందర్భంగా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని తేల్చిచెప్పాడు రజనీకాంత్. ఆ దేవుడు ఆశిస్తే, రాజకీయాల్లోకి కూడా వస్తానని సృష్టం చేశారు. లేదంటే ఇలాగే నటుడిగా కొనసాగుతానని తన ఫ్యాన్స్‌కి తెలిపాడు. రజినీకాంత్ చెప్పినదానినిబట్టి చూస్తోంటే త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయం అని అప్పటినుంచీ తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఇదిలావుంటే, తాజాగా ఆయన పార్టీ ప్రకటనకి తేదీ ఖరారైపోయిందని తమిళనాట ఓ టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ తన పుట్టినరోజైన డిసెంబర్ 12న కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయనేది ఆ టాక్ సారాంశం. ప్రస్తుతం రజనీ పార్టీ పేరు, జెండా, ఎజెండాపై ప్రణాళికలు రచిస్తున్నట్లు తమిళతంబీలు చెప్పుకుంటున్నారు. అందుకోసం రజనీ టీమ్ బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.













