సుప్రీం కోర్టు సరేనంటే ఓటర్ల జాబితాతో ‘ఆధార్’
లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ వెల్లడి
దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బట్టి ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి తెలిపారు. బుధవారం లోక్‌సభలో విశాఖ ఎంపీ హరిబాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఓటర్ల జాబితాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015 మార్చిలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిందని చెప్పారు. 2015 ఆగస్టు నాటికి ఆ ప్రక్రియ పూర్తి వేగం పుంజుకొందన్నారు. దీనిపై దాఖలైన ఒక కేసులో 2015 ఆగస్టు 11న సుప్రీం కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయినట్లు చెప్పారు.








