జన్ ధన్ లోకి రూ. 65 వేల కోట్లు : మోడీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్‌ధన్ యోజన ద్వారా ఇప్పటి వరకు 30 కోట్ల కుటుంబాలు ఖాతాలు తెరిచాయని తెలిపారు ప్రధాని మోడీ. ఈ ఖాతాల్లో రూ.65,000 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ఆదివారం(ఆగస్టు-27) మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోమవారం(ఆగస్టు-28)తో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతోందన్నారు. ఈ పథకం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఓ చర్చనీయ అంశంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకంపై ఇప్పటికే బ్యాంకులు సర్వే నిర్వహించి సామాన్య మానవుడికి పలు ప్రయోజనాలు కలుగుతున్నట్లు వెల్లడించాయని తెలిపారు. అంతే కాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలు కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. వీటి వల్ల పేదప్రజలకు తమ జీవితాలపై భరోసా ఏర్పడుతుందని వెల్లడించారు.








