త్వరలో పవన్ ప్రజాయాత్ర : జనసేన
త్వరలో పవన్ కల్యాణ్ ప్రజాయాత్ర చేయడం ఖాయమని జనసేన పార్టీ మీడియా వ్యవహారాల ఇన్చార్జి హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని తెలిపారు. పవన్ ఇకపై నిరంతరం ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి తమతో కలిసి వచ్చే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని పేర్కొన్నారు. పాదయాత్ర లేదా బస్సు యాత్ర లేక ఇతర ఏ రూపంలోనైనా ప్రజాయాత్ర ఉంటుందని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన అజెండా అని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజామోదమైతే ఆమోదిస్తామని లేకపోతే వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే ఇస్తామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసే వారందరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. 2014లో అప్పటి పరిస్థితుల మేరకు బీజేపీ, టీడీపీలకు జనసేన మద్దతిచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.








