పాస్‌పోర్టుకు హిందీలోనూ దరఖాస్తు
ఆన్లైన్లో పాస్‌పోర్టు కోసం హిందీ భాషలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు విదేశాంగా వ్యవహారాల శాఖ వెసులుబాటు కల్పించింది. అధికారభాషపై పార్లమెంటు సంఘం ఈ మేరకు చేసిన సిఫారసును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆమోదించారు. వాస్తవానికి అధికార భాషపై పార్లమెంటు సంఘం 2011లోనే తన తొమ్మిదో నివేదికను సమర్పించింది. దీని ప్రకారం హిందీభాషలోనూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వీలుండాలి. అందుకోసం ఇంగ్లీషు, హిందీ భాషల్లో దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. హిందీలో నింపి సమర్పించిన దరఖాస్తులను ఆమోదించాలని పార్లమెంటు సంఘం సూచించింది. ఇటీవలే ఈ సిఫారసును రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ఉమ్మడి హిందీ బోధనా పథకాన్ని అనుసరించాలని కమిటీ పేర్కొంది. హిందీ విభాగంలేని యూనివర్సిటీల్లో తక్షణమే ఆ విభాగాన్ని నెలకొల్పాలని కమిటీ పేర్కొంది.













