ఇక హిందీలోనూ పాస్‌పోర్టు దరఖాస్తులు
ఇకపై హిందీ భాషలో కూడా పాస్‌పోర్టు దరఖాస్తులు చేసుకునే సదుపాయం కల్పించింది విదేశాంగ శాఖ. ఈ మేరకు అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంగ్లంతో పాటు హిందీలోనూ దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆ శాఖ పేర్కొంది. అధికారిక భాష హిందీపై 2011లో పార్లమెంటరీ సంఘం తొమ్మిదో కమిటీ పలు సిఫార్సులు చేసి నివేదిక రూపొందించింది. ఇటీవలే ఈ నివేదికను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని పాస్‌పోర్టు కార్యాలయాల్లో ద్విభాషా దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేగాక, హిందీలో నింపిన దరఖాస్తును కూడా విదేశాంగ శాఖ ఆమోదించాలని పేర్కొంది. ఇక, పాస్‌పోర్టులపై కూడా హిందీలో పేర్లను రాయలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఇటీవలే ఆమోదముద్ర వేశారు.
ఈ మేరకు పాస్‌పోర్టు వెబ్సైట్ నుంచి హిందీ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. నింపిన దరఖాస్తులను తిరిగి వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయాలని చెప్పింది. దరఖాస్తును ఆన్లైన్లో కాకుండా పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో ఇస్తే అనుమతించబోమని విదేశాంగశాఖ సృష్టంచేసింది.













