అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల వెళ్లే భక్తుల వ్యయప్రయాసలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల సమీపంలో విమానాశ్రయం నిర్మించనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపింది. శబరిమల వెళ్లేందుకు భక్తులకు రహదారే ఏకైక మార్గం. దీంతో ఏటా భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ నిర్మాణానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలో 2,263 ఎకరాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇది శబరిమలకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులతో పాటు, పీడబ్ల్యూడీ రోడ్లకు దగ్గరగా ఉండడం వల్ల శబరిమల ప్రయాణం సులువు కానుంది.








