గుంటూరు ఘటనపై వైసీపీ విమర్శల అటాక్..!
గుంటూరు(Guntur) నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఒక మహిళపై జరిగిన దాడి ఉదంతం ఇప్పుడు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ దారుణ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా గాల్లో కలిసిపోయిందని, కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని వైసీపీ మహిళా నేతలు విమర్శల పర్వానికి తెరలేపారు. గుంటూరు ఘటనపై మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంయుక్తంగా స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు.
రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల రక్షణను పర్యవేక్షించాల్సిన హోం మంత్రి అనిత.. మహిళ అయినప్పటికీ, గుంటూరు నడిబొడ్డున మహిళలపై ఇంతటి దారుణమైన దాడి జరగడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వారు విమర్శించారు. ఈ దారుణ దాడి వెనుక అధికార తెలుగుదేశం పార్టీ (TDP) నేతల ప్రమేయం స్పష్టంగా ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి వైరల్ అయిన తర్వాతే పోలీసులు కంటితుడుపుగా కేసు నమోదు చేశారని వారు మండిపడ్డారు.
బాధితురాలికి న్యాయం చేయడంలో పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని వారు ధ్వజమెత్తారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించాలని విడదల రజిని, వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. కృష్ణబాబు కాలనీ ఘటనలో మహిళపై దాడికి తెగబడిన నిందితులు ఎంతటి వారైనా సరే, వారి వెనుక రాజకీయ అండదండలు ఉన్నా వదలకుండా కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి తక్షణమే న్యాయం చేకూర్చాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.








