ఏపీ కేబినెట్ భేటీకి జనసేన మంత్రులంతా దూరం..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన అత్యంత కీలకమైన రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశానికి జనసేన పార్టీకి చెందిన మంత్రులెవరూ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల శాతాలను కరారు చేసేలా మిశ్రా కమిషన్ నివేదికపై చర్చించడానికి ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో(Pawan Kalyan) పాటు జనసేన తరఫున ప్రభుత్వంలో ఉన్న మిగతా మంత్రులు కూడా పూర్తిగా గైర్హాజరయ్యారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండిపోగా మరో మంత్రి కందుల దుర్గేష్ వ్యక్తిగత కారణాల వల్ల స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. మహాలయ అమావాస్య పూజా కార్యక్రమాలు మరియు పితృ తర్పణాల వల్లే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి రాలేకపోయారని జనసేన వర్గాలు పైకి అధికారికంగా చెప్తున్నప్పటికీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం గుసగుసలు వేరేలా వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గతంగా ఏవైనా విభేదాలు తలెత్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్ చైర్మన్ మరియు కార్పొరేషన్ మేయర్ స్థానాల కేటాయింపులో జనసేన ఆశించిన సంఖ్యలో సీట్లు దక్కకపోవడం వల్లే నిరసనగా మంత్రులంతా ఈ భేటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పలుమార్లు కేబినెట్ సమావేశాలకు రాకపోవడంపై చర్చ నడిచినా ఈసారి ఏకంగా జనసేన మంత్రులంతా ఒకేసారి డుమ్మా కొట్టడం కూటమి ప్రభుత్వంలో అసంతృప్తి సంకేతాలు ఇస్తోందని పరిశీలకులు అంటున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే భాగస్వామ్య పార్టీల మధ్య తలెత్తిన ఈ గ్యాప్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో చూడాలి.








