జగన్ పాత కేసుల ఫైళ్లు దుమ్ముదులిపిన ఈడీ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) చుట్టూ చట్టపరమైన సమస్యలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. దశాబ్ద కాలంగా నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టులో సాగుతున్న క్విడ్ ప్రో కో వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా తన దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఈ కేసుల ట్రయల్ ను వీలైనంత త్వరగా ముగించాలనే పట్టుదలతో ఈడీ ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలంటూ ఉన్నత న్యాయస్థానంలో ఒక కీలక పిటిషన్ దాఖలు చేసింది.
ఈ తాజా లీగల్ అస్త్రంలో ఈడీ ప్రధానంగా రెండు డిమాండ్లను కోర్టు ముందు ఉంచింది. గత పదేళ్లుగా నాంపల్లి కోర్టు పరిధిలో ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్ లో ఉండిపోయిన 9 ఈడీ ఛార్జ్షీట్లపై రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపించాలని కోరింది. నిందితులు డిస్చార్జ్ పిటిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా వేగంగా తుది తీర్పులు వచ్చేలా చూడాలని అభ్యర్థించింది. దీనితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం 74 మందిని విచారణ సమయాల్లో కోర్టుకు భౌతికంగా హాజరయ్యేలా కఠిన ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
గతంలో అధికారిక హోదాల రీత్యా జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుండి పలు మినహాయింపులు పొందారు. అయితే ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేయాలంటే నిందితుల ప్రత్యక్ష హాజరు అత్యంత అవసరమని ఈడీ వాదిస్తోంది. ఇటువంటి కార్పొరేట్ అక్రమాలు, అక్రమ నగదు చలామణి వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలను కేవలం సాధారణ సివిల్ వివాదాలుగా చూడలేమని ఇవి దేశ ఆర్థిక ఆరోగ్యానికే తీవ్రమైన ముప్పు తెచ్చిపెడతాయని ఈడీ తన పిటిషన్ లో గట్టిగా పేర్కొంది. ఈ తాజా పరిణామం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చకు దారితీస్తోంది.








