Delimitation: లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధం!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం మేర పెంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదిత బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, పెరిగిన స్థానాలతోనే ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సోమవారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలు 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 ఎమ్మెల్యే స్థానాల సంఖ్య 6,185కి చేరుతుంది. నియోజకవర్గాల పెంపుతో పాటే 33 శాతం మహిళా రిజర్వేషన్లను కూడా 2029 నుంచే అమలు చేయనున్నారు.
కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి పెరుగుతాయి. లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి చేరుతాయి. తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి, లోక్సభ స్థానాలు 17 నుండి 26కి పెరుగుతాయి. ఈ పెంపుదల వల్ల ప్రతి జిల్లాలోనూ కొత్త నియోజకవర్గాలు ఏర్పడటమే కాకుండా, ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులు పునర్విభజన జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
సాధారణంగా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే, కేంద్రం ఇక్కడ ఒక వినూత్న ఫార్ములాను అనుసరిస్తోంది. రాష్ట్రాల జనాభాతో సంబంధం లేకుండా, ప్రస్తుతం ఉన్న సీట్లపై నేరుగా 50 శాతం అదనంగా పెంచడం ద్వారా అన్ని రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య ఎటువంటి వ్యత్యాసం రాదు.
రాజ్యాంగంలోని 170(3), 81(3) అధికరణల ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగానే సీట్ల పెంపు జరగాలి. తాజా సమాచారం ప్రకారం, 2027 మార్చి నాటికి దేశంలో జనగణన పూర్తి కానుంది. ఈ లోపే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాలకు అవసరమైన సవరణలు చేస్తూ పార్లమెంటులో బిల్లులు ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027లో వచ్చే ప్రాథమిక జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ రంగంలోకి దిగి, 2028 నాటికి నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేయనుంది.
ఈ నిర్ణయంపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి మంగళవారం భేటీ అయి తమ కార్యాచరణను ప్రకటించనుంది. సీట్ల పెంపుతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా దామాషా ప్రకారం పెరుగుతాయని సమాచారం. మొత్తానికి, 2029 ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా మారబోతున్నాయి.
ఇవి కూడా చదవండి








